Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Komatireddy Venkat Reddy : ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ద్వారా ప్రజలకు మరిన్ని వైద్య సేవలు

–అవసరమైన అన్ని వైద్య పరికరాలు, సౌకర్యాలను కల్పిస్తాం

— రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి

-డయాలసిస్ కేంద్రం ప్రారంభం

Minister Komatireddy Venkat Reddy :

ప్రజాదీవెన నల్గొండ : నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలోని అన్ని విభాగాలలో అవసరమైన వైద్య పరికరాలు, సౌకర్యాలను కల్పిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఇందుకుగాను అవసరమైన ప్రతిపాదనలను తక్షణమే రూపొందించి సమర్పించాల్సిందిగా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో అభివృద్ధిపరిచిన డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు. అంతేకాక డయాలసిస్ కేంద్రానికి వచ్చిన నూతన వైద్య పరికరాలను పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ ఛాంబర్ లో ఆసుపత్రి వైద్యులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి ద్వారా ప్రజలకు మరిన్ని వైద్య సేవలు అందించడంలో భాగంగా పోస్టుల భర్తీతో పాటు, ఎన్ఐసి, పిఐసి, ఆర్థోపెడిక్ తదితర అన్ని విభాగాలలో కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని, అలాగే బ్లడ్ బ్యాంక్ కు అవసరమైన రిఫ్రిజిరేటర్ ఇతర సౌకర్యాలను కల్పిస్తామని తెలిపారు. ఇందుకు కావలసిన సౌకర్యాలు, వైద్య పరికారాలపై స్పష్టంగా ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. త్వరలోనే బ్లడ్ బ్యాంక్ ద్వారా ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రసవం తర్వాత తల్లికి,బిడ్డకు పనికి వచ్చేలా ఎం సి హెచ్ కిట్లను అందించేందుకు అన్ని వస్తువులతో కిట్లను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అవసరమైన సహాయాన్ని అందజేస్తామని తెలిపారు. ఖాళీగా ఉన్న ఫిజీషియన్, సర్జన్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఆస్పత్రికి అవసరమైన ఇతర మౌలిక వసతులు, భవనాలు, సివిల్ పనులు,పోస్టులకు సైతం ప్రతిపాదనలు సమర్పించాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటిండెంట్ డాక్టర్ అరుణ కుమారి, డి ఎం హెచ్ ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డిఎం హెచ్ ఓ వేణుగోపాల్ రెడ్డి ,ఆసుపత్రి వైద్యులు, తదితరులు ఈ సమక్షా సమావేశానికి హాజరయ్యారు.