Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Anaganti Venkatesh : గంజాయి డ్రగ్స్ నిర్ములనకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి

–నిరుద్యోగ యువతకు ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి

— డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేష్

Anaganti Venkatesh  : ప్రజాదీవెన నల్గొండ : విద్యార్థులు,యువత గంజాయికి,డ్రగ్స్ కి బానిసలై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని,గంజాయి డ్రగ్స్ నిర్ములనకై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్ యువతకి పిలుపునిచ్చారు. సోమవారం భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డివైఎఫ్ఐ) నల్లగొండ జిల్లా కమిటి అధ్వర్యంలో గంజాయి, డ్రగ్స్ ను నిర్మూలిద్దాం.. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ను నిషేదించాలని, జిల్లా లో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని చేపట్టిన యువ చైతన్య సైకిల్ యాత్ర నల్లగొండ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతి రావు ఫూలే విగ్రహలకు రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్, బృందం సభ్యులు పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజి అండ్ కాకతీయ డిగ్రీ కళాశాల వద్ద జరిగిన సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ అనేకమంది విద్యార్థులు యువత గంజాయికి డ్రగ్స్ కు బానిసలుగా మారి బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకొని ఉన్నత చదువులకు, ఉద్యోగాలకు దూరమై కుటుంబాలకు భారమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ భవిష్యత్, అభివృద్ధి యువతపై ఆధారపడి ఉంది.

దేశం వివిధ రంగాల్లో రాణించాలంటే యువత మేధస్సు, నైపుణ్యం అవసరం. దేశం ఔన్నత్యాన్ని నిలబెట్టగల శక్తి సామర్థ్యాలు యువత సొంతం. మార్పు రావాల్సింది‌ యువతలో, మార్పు తేవాల్సింది కూడా యువతే అన్నారు. దురదృష్టవశాత్తు నేటి యువత తమ కర్తవ్యాన్ని విస్మరించి మత్తులో తేలియాడి జ్ఞానాన్ని, విచక్షణను, శక్తిసామర్థ్యాలను కోల్పోయి నిర్వీర్యమై, నిస్తేజంగా మారుతున్నారని పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ లాంటి మాదక ద్రవ్యాల వినియోగం వలన యువశక్తి పెడదారి పడుతున్నది. యువతను మత్తులో ముంచి చిత్తు చేసే గంజాయి, డ్రగ్స్ అక్రమ వినియోగానికి అడ్డుకట్ట వేయాలని అన్నారు. మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్నా, డ్రగ్స్ వినియోగం తగ్గడం లేదు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేయాలి. అదేవిధంగా అక్రమ రవాణాను అడ్డుకోవాలి. ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపట్టాలి. తల్లిదండ్రులు, విద్యాసంస్థలు, ప్రభుత్వాలు, సమాజం అందరూ కలిసి కట్టుగా పోరు సాగిస్తే మాదక ద్రవ్యాలు మహమ్మారిని తరిమివేయడం సాధ్యం అవుతుందని, డివైఎఫ్ఐ నిర్వహించే కార్యక్రమాల్లో విద్యార్థులు,యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిషేధించి యువత ప్రాణాలను కాపాడాలన్నారు.
జిల్లాలో అనేక పరిశ్రమలు ఉన్న స్థానిక యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటిని అమలు చేయాలని అన్నారు. ప్రభుత్వాలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతోనే యువత చెడు మార్గంలో పయాణిస్తున్నారని ప్రభుత్వాలు సరైన ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం. రవి నాయక్, మల్లం మహేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మం పాటి శంకర్, యాత్ర సభ్యులు పుల్లెంల శ్రీకర్, గుండాల నరేష్, కట్ట లింగస్వామి, వడ్డగాని మహేష్, పాలాది కార్తీక్, కండే యాదగిరి, రాజేష్, సాయి తేజ, సుకుమార్, కిరణ్, రవి, రాజు, నాగేశ్వరరావు, రఫి, నాగయ్య, శివ,ఆంజనేయులు, వేణుతదితరులు పాల్గొన్నారు.