–పది లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థిని అభినందించిన కలెక్టర్
— సొంత ఖర్చులతో ఫ్లైట్ లో విశాఖపట్నం పంపించనున్న జిల్లా పాలనాధికారి
–ఈ నెల 17 న మాడుగుల పల్లి స్పెషలాఫీసర్ సునీతతో కలిసి ఫ్లైట్ లో వైజాగ్ కు విద్యార్థిని
Grand Felicitation :ప్రజాదివేన నల్గొండ :బాలికా సాధికారతను సాధించే దిశగా జిల్లాలోని బాలికలను చదువు వైపు ప్రోత్సహిస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తాను జిల్లా కలెక్టర్ గా నల్గొండ జిల్లాలో బాధ్యతలు చేపట్టినప్పటి నుండి జిల్లాలోని పలు పాఠశాలలను, ముఖ్యంగా కేజీబీవీ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన విషయం తెలిసిందే. అయితే జిల్లా కలెక్టర్ కేజిబివి ల సందర్శన సందర్భంగా విద్యార్థినిలు అత్యధిక మార్కులు సాధించే విధంగా పలు రకాలుగా వారిని ప్రోత్సహించారు. వారి విషయ పరిజ్ఞానాన్ని, వారి ప్రతిభను, అన్ని విషయాలపై విద్యార్థినిలతో ముఖాముఖి మాట్లాడి పరీక్షించడమే కాకుండా, ఆయా సబ్జెక్టులలో రాణించి మంచి మార్కులు తెచ్చుకునేలా ప్రోత్సహించడం జరిగింది. ఇందులో భాగంగానే కనగల్ కేజీబీవీ ని సందర్శించిన సమయంలో ఈ సంవత్సరం పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించే కేజీబీవీ విద్యార్థినిలను తన సొంత ఖర్చులతో ఫ్లైట్లో పంపిస్తానని విద్యార్థినిలకు మాట ఇవ్వడమే కాకుండా తెల్ల కాగితంపై రాసి ఇచ్చారు. ఇచ్చిన మాట ను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం నిలబెట్టుకున్నారు. మాడుగులపల్లి కేజీబీవి విద్యార్థిని పుట్ల ప్రసన్న పదవ తరగతిలో 600 మార్కులకు గాను 563 మార్కులు సాధించి కెజిబివి లో జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది.
ఈ మేరకు జిల్లా కలెక్టర్ తన సొంత ఖర్చులతో విద్యార్థిని ప్రసన్నను, మాడుగులపల్లి కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కే. సునీతలను ఈ నెల 17 న విశాఖపట్నం పంపించనున్నారు. ఈనెల 19 వరకు వీరు విశాఖపట్టణంలో గడపనున్నారు. ఫ్లైట్ చార్జీలతో పాటు, అక్కడ వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను జిల్లా కలెక్టర్ సొంత ఖర్చులతో కల్పిస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఫ్లైట్ టికెట్లను బుధవారం తన ఛాంబర్ లో విద్యార్థినికి అందజేశారు.
ఆడపిల్లలను చదువుకోమని ప్రోత్సహించడమే కాకుండా, సొంత ఖర్చుతో ఫ్లైట్ ఎక్కించి విశాఖపట్నం పంపిస్తున్నందుకుగాను విద్యార్థిని ప్రసన్న, కేజీబీవీ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ కే. సునీతలు జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇన్చార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల ఇంచార్జి అదనపు కలెక్టర్, గృహ నిర్మాణ శాఖ పిడి రాజకుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, తదితరులు ఈ కార్యక్రమంలో ఉన్నారు.