–రిటైర్ ఐఏఎస్ చల్లేటి ప్రభాకర్
IAS Challeti Prabhakar : ప్రజాదీవెన నల్గొండ టౌన్ : అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రభుత్వం బీసీలకు మొండిచేయి చూపించిందని రిటైర్ ఐఏఎస్ చల్లేటి ప్రభాకర్ అన్నారు. స్థానిక అంబేద్కర్ భవన్లో పలు రాజకీయ పార్టీలు, కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన బడ్జెట్ బహుజనులు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు నేలపట్ల సత్యనారాయణ మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం బీసీలకు 50 వేల కోట్లు కేటాయించాల్సింది పోయి కేవలం 11405 కోట్లు మాత్రమే ప్రకటించడం అన్యాయం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధికారంలోకి వచ్చిన అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు అన్యాయం చేస్తూనే ఉన్నాయని, జనాభా ప్రతిపాదికన బడ్జెట్లో కేటాయింపులు ఉండాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు నల్లసోమ మల్లయ్య తెలిపారు.
కెవిపిఎస్ రాష్ట్ర నాయకులు నాగార్జున మాట్లాడుతూ చాలీచాలని బడ్జెట్ తో బహుజనులు ఎలా అభివృద్ధి చెందుతారని, పాలకులు ఇలాంటి బహుజన వ్యతిరేక చర్యలు అవలంబిస్తే అన్ని రాజకీయ పార్టీలు కుల సంఘాలు ఏకతాటిపై వచ్చి పోరాటాలకు సిద్ధపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు బొర్రా సుధాకర్ అధ్యక్షత వహించగా బహుజన కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర నాయకులు పర్వతాలు, అంబేద్కర్ జగ్జీవన్ రామ్ అభివృద్ధి కమిటీ నాయకులు కత్తుల షణ్ముఖ , పట్టణ టిడిపిఅధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, కంది సూర్యనారాయణ, అద్దంకి నరసింహ , జిల్లా బీసీ నాయకులు కన్నెబోయిన నరసింహ యాదవ్, పెరిక రాజు, బహుజన నేత వంటపాక యాదగిరి తదితరులు పాల్గొన్నారు.