–జర్నలిస్టుల ప్రధాన సమస్యలపై తీర్మానాల ఆమోదం
IJ National Conferences:ప్రజా దీవెన,చండీగఢ్: వర్కింగ్ జర్నలిస్టుల ( working journalist) ప్రధాన డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఢిల్లీలో త్వరలో పెద్ద ఎత్తున ఆందోళనా కార్యక్రమం చేపట్టాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐ జే యూ) నిర్ణయించింది. హర్యానాలోని పంచకులలో ఆగస్టు 3-4 తేదీలలో జరిగిన ఐజేయూ జాతీయ కౌన్సిల్ సమావేశాలలో (National Council meetings) మీడియా స్వేచ్ఛ పరిరక్షణ, మీడియా స్థితిగతులు , జర్నలిస్టుల భద్రత వంటి విషయాలపై సమగ్రంగా చర్చ జరిగిందని అధ్యక్షుడు కే శ్రీనివాసరెడ్డి, సెక్రటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్మూ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. చండీగఢ్, హర్యానా జర్నలిస్ట్ యూనియన్ ఈ సమావేశాలకు ఆతిథ్యం ఇచ్చింది. దేశంలో మీడియా రంగంలో సాంకేతికత పెరగడం, కృత్రిమ మేధను వినియోగించడం, డిజిటల్ మీడియా విస్తరణ నేపథ్యంలో మీడియా స్థితిగతుల అధ్యయనానికి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని ఐజేయూ చిరకాలంగా డిమాండ్ చేస్తున్నదని అయితే ప్రభుత్వం తమ డిమాండును పెడచెవిన పెడుతున్నదని వారా ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు.
జర్నలిస్టులపై దాడుల నిరోధానికి ప్రత్యేకచట్టం తేవాలని, వర్కింగ్ జర్నలిస్ట్స్ యాక్ట్ ను, వేజ్ బోర్డ్ ను, కన్సెషన్ రైల్వే పాస్ (Pass Working Journalists Act, Wage Board, Concession Railway) సౌకర్యాన్ని పునరుద్ధరించాలని, ప్రెస్ కౌన్సిల్ ను మీడియా కౌన్సిల్ గా మార్చాలని చాలా కాలంగా ఐజేయూ డిమాండ్ చేస్తున్నది. అయితే కేంద్ర ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తుండటంతో తమ సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాలని ఐజేయు జాతీయ కౌన్సిల్ నిర్ణయించిందని శ్రీనివాస్ రెడ్డి, బల్విందర్ సింగ్ జమ్మూ ఆ ప్రకటనలో తెలిపారు. త్వరలో నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాల నుంచి జర్నలిస్టులను సమీకరించాలని ఐజేయూ సమావేశం నిర్ణయించినట్లు వారా ప్రకటనలో తెలిపారు. ఛలో ఢిల్లీ కార్యక్రమం తేదీని ఐజేయూ నాయకత్వం త్వరలో నిర్ణయిస్తుందని వారు పేర్కొన్నారు.
ఐజేయూ అధ్యక్షుడు కే.శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన నేషనల్ కౌన్సిల్ సమావేశంలో 18 రాష్ట్రాలకు చెందిన రెండువందల మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
ప్రారంభ సమావేశంలో హర్యానా శాసనసభ స్పీకర్ ధ్యాన్ చంద్ గుప్తా (Dhyan Chand Gupta) ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. హర్యానా ఆర్థిక శాఖ మంత్రి జయప్రకాష్ దలాల్, వ్యవసాయ శాఖ మంత్రి కన్వర్ పాల్, హర్యానా ముఖ్యమంత్రి మీడియా సలహాదారు రాజీవ్ జైట్లీ, ప్రభుత్వ ప్రచార సలహాదారు తరుణ్ బండారి పాల్గొని సందేశాలు ఇచ్చారు. ముగింపు సమావేశంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్యఅతిథిగా పాల్గొని సందేశం ఇచ్చారు. ఐజేయూ సెక్రెటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్మూ యూనియన్ ఇటీవల చేపట్టిన కార్యక్రమాల నివేదికను సమర్పించగా, రాష్ట్ర యూనియన్ల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాష్ట్రాల నివేదికలను సమర్పించారు. ఆరు ప్రధాన డిమాండ్లపై తీర్మానాలను జాతీయ కౌన్సిల్ సమావేశం ఆమోదించింది. దేశంలో జర్నలిస్టులపైన, మీడియా సంస్థల మీద దాడులు పెచ్చరిల్లడంపై సమావేశం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. జర్నలిస్టుల రక్షణకు మహారాష్ట్ర, చత్తీస్ గఢ్ రాష్ట్రాలు ప్రత్యేక చట్టాలు చేయడంపై సమావేశం హర్షం వ్యక్తం చేసింది.
జాతీయస్థాయిలోనూ, రాష్ట్రాలలోనూ వెంటనే ఇటువంటి చట్టాలు తేవాలని ఒక తీర్మానంలో ఐజేయూ డిమాండ్ చేసింది. కార్మిక చట్టాల కోడిఫికేషన్ (Codification of labor laws) పేరిట రద్దు చేసిన వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ను, వేజ్ బోర్డును, పునరుద్ధరించాలని మరో తీర్మానంలో ఐజేయూ డిమాండ్ చేసింది. యూనియన్ నియమావళిలో సవరణలు, సంస్థాగత నిర్మాణానికి సంబంధించి మరికొన్ని తీర్మానాలు చేసినట్లు కే. శ్రీనివాస్ రెడ్డి, బల్విందర్ సింగ్ జమ్మూ తెలిపారు. త్రిపుర, మేఘాలయ, సిక్కిం వంటి ఈశాన్య రాష్ట్రాలలోనూ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలోనూ యూనియన్ విస్తరణకు కృషి జరుగుతున్నట్లు వారు తెలిపారు. దేశంలో బలమైన వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమాన్ని నిర్మించడపై యూనియన్ కేంద్రీకరించి పనిచేస్తున్నదని వారు తెలిపారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) ప్రధాన కార్యదర్శి కె.రామ్ నారాయణ, ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) అధ్యక్షుడు ఐ వి సుబ్బారావు తమ రాష్ట్రాల నివేదికలను సమర్పించారు. ఐజేయూ మాజీ అధ్యక్షుడు, స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎస్ఎన్ సిన్హా, దేవులపల్లి అమర్, స్టీరింగ్ కమిటీ సభ్యుడు ఎంఏ మాజీద్, ఐజేయూ కార్యదర్శులు వై నరేందర్ రెడ్డి, డి సోమసుందర్, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు కె.వి.విరాహత్ అలీ, ఏపీయూడబ్ల్యూజే ప్రధానకార్యదర్శి చందు జనార్ధన్ సమావేశంలో పాల్గొన్నారు.