— పరిశ్రమల సహకారంతో పాఠ శాలల్లో మౌలిక సదుపాయాలు
–నిధుల సమీకరణ కోసం 28న ప్రత్యేక సమావేశం
— జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వెల్లడి
Janampally Anirudh Reddy :ప్రజా దీవెన , జడ్చర్ల: జడ్చర్ల నియోజకవర్గంలోని పాఠశాలల్లో రాబోయే రెండేళ్లకాలంలో రూ.70 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తామని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తెలిపారు. దీని కోసం అవసరమైన నిధులను పోలేపల్లి సెజ్ లో ఉన్న పరిశ్రమల నుంచి సీఎస్ఆర్ పథకం కింద సేకరిస్తామని చెప్పారు. పాఠశాలల అభివృద్ధికి అవసరమైన నిధుల సమీకరణ కోసమే పరిశ్రమల నిర్వాహకులు, విద్యాశాఖ అధికారులతో ఈనెల 28న ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసామని వెల్లడించారు.
జడ్చర్ల కేంద్రంలోని ప్రేమ్ రంగా గార్డెన్లో బుధవారం మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పదవ తరగతి విద్యార్థుల ప్రేరణ కార్యక్రమానికి అనిరుధ్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగానే అనిరుధ్ రెడ్డి మాట్లాడుతూ, 10వ తరగతి విద్యార్థుల భవిష్యత్తుకు అత్యంత కీలకమని, పదో తరగతి తర్వాతనే విద్యార్థులు వారి భవిష్యత్తులో ఏ వృత్తిని ఎంచుకుంటారనే విషయం నిర్ధారణ అవుతుందని చెప్పారు. పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే మంచి కళాశాలల్లో, కోర్సుల్లో ప్రవేశాలు లభిస్తాయని అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తాము పదవ తరగతి విద్యార్థుల కోసం డిజిటల్ కంటెంట్ పుస్తకాలను తయారు చేయించి విద్యార్థులకు ఉచితంగా ఇస్తున్నామన్నారు. 8,9,10 తరగతుల విద్యార్థుల కోసం మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, సోషియల్ పాఠ్యాంశాలకు సంబంధించిన డిజిటల్ కంటెంట్ ను తాము తయారు చేయించామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి టీచర్లు ఉన్నప్పటికీ సరైన మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అనిరుధ్ రెడ్డి చెప్పారు. అయితే విద్యార్థుల వెతలు తీర్చడంలో భాగంగానే తాను ఈ ఏడాది నియోజకవర్గంలోని విద్యార్థులందరికీ బాటా షూలను ఇచ్చామని గుర్తు చేసారు. వచ్చే విద్యాసంవత్సరంలో బాటా షూలతో పాటుగా స్కూల్ బ్యాగు, వాటర్ బాటిళ్లను కూడా విద్యార్థులందరికీ ఇస్తామని ప్రకటించారు.
నియోజకవర్గంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన భవనాలు, ఫర్నీచర్, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి రూ.70 కోట్లు అవసరమౌతాయని అధికారులు అంచనా వేయడం జరిగిందని తెలిపారు. ఒక ఎమ్మెల్యేగా తాను ఇంత పెద్ద మొత్తాన్ని ప్రభుత్వం నుంచి తీసుకురావడం కొంత కష్టమేనని అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లోనే పోలేపల్లి సెజ్ లోని పరిశ్రమల నుంచి సీఎస్ఆర్ పథకం ద్వారా రూ.70 కోట్లను సమీకరించనున్నామని వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఈనెల 28న పరిశ్రమల నిర్వాహకులతో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసామని, ఆ సమావేశంలో నియోజకవర్గంలోని పాఠశాలల అవసరాలను వివరించి నిధులను సమీకరిస్తామని చెప్పారు. సీఎస్ఆర్ పథకంలో భాగంగా సేకరించే రూ.70 కోట్ల నిధులతో రాబోయే రెండేళ్ల కాలంలో అన్ని పాఠశాలలను అభివృద్ధి చేయడం తన లక్ష్యమని తెలిపారు. ఇప్పటి వరకూ ఇలాంటి ప్రయత్నం ఎవరూ చేయలేదన్నారు. గత ప్రభుత్వం హయాంలో ఎవరూ కూడా స్కూలు పిల్లల కోసం ఏమీ అడగకుండా ‘‘ మీ ఇంటికొస్తే మాకేమిస్తారు.. మా ఇంటికి వస్తే మాకేం తెస్తారు..’’ అనే విధానంతో సీఎస్ఆర్ నిధులను కూడా తమ స్వలాభానికే వినియోగించుకున్నారని అనిరుధ్ రెడ్డి విమర్శించారు. విద్యార్థులు భవిష్యత్తులో తమ అభిరుచికి అనుగుణంగా తామేమి కావాలనే విషయాన్ని తామే స్వయంగా నిర్ణయించుకోవాలని హితవు చెప్పారు. విద్యార్థులకు తమ కెరియర్ పరంగా ఎలాంటి సందేహాలు ఉన్నా తమ తల్లిదండ్రులతో కలిసి తన కార్యాలయానికి వస్తే అవసరమైన సలహాలు ఇస్తామని అనిరుధ్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగానే పదవ తరగతి విద్యార్థులకు డిజిటల్ కంటెంట్ పుస్తకాలను ఆయన పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.