–వామపక్ష వేదిక ఏర్పాటుకు కృషి చేస్తాం
–స్థానిక ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం
–వామపక్ష పార్టీలున్న చోట పర స్పర సహకారం
–మోడీ సర్కార్‌ది ముమ్మాటికీ పేదలకు వ్యతిరేకo
–ప్రజల్లో రాజకీయ చైతన్యం తీసు కొస్తాం
–టీడబ్ల్యూజే ఎఫ్, హెచ్‌యూజే మీట్ ది మీడియాలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
John Wesley : ప్రజా దీవెన, హైదరాబాద్ : తెలంగాణలో వామపక్ష ప్రత్యా మ్నాయ వేదిక ఏర్పాటుకు కృషి చేస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్య దర్శి జాన్ వెస్లీ ప్రకటించారు. రా ష్ట్రంలో ప్రజా ఉద్యమాలతో ప్రత్యా మ్నాయ శక్తిగా ఎదుగుతామని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో ఒంటరి గానే పోటీచేస్తామనీ, అయితే, వా మపక్ష పార్టీలు బలంగా ఉన్న చోట పరస్పర సహకారంతో ముందుకెళ్తా మని నొక్కి చెప్పారు. ప్రజల్లో రాజ కీయ చైతన్యం తీసుకొస్తామనీ, ధ న, మద్య ప్రలోభాల రాజకీయా లను తిప్పొకొడతామని చెప్పారు. కేంద్రంలోని మోడీ సర్కారు ప్రవేశ పెట్టిన బడ్జెట్ ముమ్మాటికీ పేదల వ్యతిరేక బడ్జెట్ అని స్పష్టం చేశా రు. కమ్యూనిస్టు పార్టీగా దేశంలోని ప్రతి ఒక్కరికీ ఉచిత విద్య, వైద్యం అందాలని తాము కోరుకుంటుంటే మోడీ సర్కారు మాత్రం ఆ రెండు రంగాలను పూర్తిగా కార్పొరేట్ల చే తుల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నదని విమర్శించారు. ఆ రెండు రంగాల కు కేవలం 4 శాతం నిధులే కేటా యించడం దానికి నిదర్శనమని చెప్పారు. బుధవారం హైదరా బాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ వర్కింగ్ జర్న లిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూ జేఎఫ్), హైదరాబాద్ యూనియన్ ఆఫ్ జ ర్నలిస్ట్స్(హెచ్‌యూజే) సంయుక్త ఆధ్వర్యంలో మీట్ ది మీడియా కా ర్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి టీడబ్ల్యూజేఫ్ వ్యవస్థాపక అధ్య క్షులు ఎమ్.ఎస్.హష్మీ సమన్వ యకర్తగా వ్యవహరించారు. కార్య క్రమంలో టీడబ్ల్యూజేఫ్ రాష్ట్ర ప్ర ధాన కార్యదర్శి బి.బసవ పున్న య్య, రాష్ట్ర కార్యదర్శులు చంద్ర శేఖర్, సలీమా, గుడిగ రఘు, హెచ్ యూజే అధ్యక్షులు అరుణ్‌కు మార్, ప్రధాన కార్యదర్శి బి.జగ దీశ్, కోశాధికారి రాజశేఖర్, నాయ కులు విజయ తదితరులు పాల్గొ న్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్లకు కట్ట బెడుతున్నదనీ, ఫలితంగానే ఒక్క శాతం ఉన్న కార్పొరేట్ల చేతిలో 27 శాతం సంపద పోగైందని చెప్పారు. అదానీ, అంబానీ లాంటి వాళ్లకు లక్షల కోట్ల రూపాయల సంపదను అప్పనంగా కట్టబెడుతున్న తీరును ఎండగట్టారు. దేశంలో 50 శాతం ఉన్న పేదల చేతుల్లో కేవలం 13 శాతం సంపదే ఉందని చెప్పారు. దీంతో పేదలు రక్తహీనత, పేదరికం, నిరుద్యోగం, నిత్యావసర సరుకులు ధరలు, విద్య, వైద్యం, ఇండ్లలేమి వంటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. గ్రామాల్లో ఉపాధి కూలీలకు పని దొరకని పరిస్థితులు ఓవైపు, వారి పిల్లలు ఉన్నత విద్యనభ్యసించినా చేసేందుకు ఉద్యోగాలు లేక ఎదుర్కొంటున్నారని చెప్పారు. మన దేశంలో ఈ అసమానతలు గత పాలకులు, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల వల్లనే అన్నారు. మన దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కుల వివక్ష ఉందనీ, సామాజిక అసమానతలు వేల ఏండ్ల నుంచి కొనసాగుతున్నా వాటిని నిర్మూలించాలనే చిత్తశుద్ధి నేటి పాలకులకు లేదని విమర్శించారు. పైగా, నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వివక్ష రూపాలను ప్రోత్సహిస్తున్న తీరును ఎండగట్టారు. కులవివక్ష సామాజిక అసమానతలకు దారితీస్తున్న తీరును వివరించారు.
దేశంలో అనేక రకాల మతాలు, కులాలు, సంస్కృతులున్నాయనీ, మనది లౌకక దేశమని చెప్పారు. అయితే, కేంద్రంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందుతున్న తీరును ఎండగట్టారు. మతోన్మాద రాజకీయాలు శ్రామిక వర్గ ఐక్యతకు, సామాజిక ఉద్యమాలకు, బడుగు, బలహీన వర్గాల పోరాటాలకు తీవ్ర ఆటంకంగా మారాయని వాపోయారు. ఈ తరుణంలో దేశంలోని లౌకిక శక్తులు ఐక్యం కావాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. 50 లక్షల 60 వేల కోట్ల రూపాయల దేశ బడ్జెట్‌లో 30 కోట్ల మంది ఉపాధి కూలీలకురూ.2.5 లక్షల కోట్లు కేటాయించాలని కోరితే కేవలం 85 వేల కోట్ల రూపాయలను మాత్రమే ఇచ్చిన మోడీ సర్కారును పేదల వ్యతిరేక ప్రభుత్వమని కాకుండా ఇంకేమని అనాలని ప్రశ్నించారు. దేశంలో అసంఘటిత కార్మికులు కనీస వేతనాలు పొందని పరిస్థతి ఉన్నా దాని గురించి కనీస ప్రస్తావన లేదన్నారు. వ్యవసాయ రంగానికి గతంలో కంటే రూ.10 వేల కోట్లను తగ్గించడమేంటని ప్రశ్నించారు. సబ్సిడీలను ఎత్తివేసి క్రమంగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల చేతిలో పెట్టి రైతులను కూలీలుగా మార్చే కుట్రకు మోడీ సర్కారు పూనుకున్నదని విమర్శించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ముమ్మాటికీ కార్మిక, కర్షక వ్యతిరేక బడ్జెట్ అని చెబుతున్నానన్నారు.
దేశ జనాభాలో 16 శాతం ఉన్న దళితులకు కేవలం ఐదు శాతం, ఏడు శాతమున్న ఎస్టీలకు కేవలం 2 శాతం నిధులు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. దేశంలో 50 శాతానికిపైగా జనాభాగా ఉన్న బీసీలకు బడ్జెట్‌లో సరైన కేటాయింపులు లేవన్నారు. మూడు, నాలుగు వేల కోట్ల రూపాయలతో మైనార్టీ సంక్షేమం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. సీపీఐ(ఎం) పార్టీగా తాము విద్యావైద్య రంగాలకు కనీసం 20 శాతం నిధులు కేటాయించాలని అడుగుతుంటే ఆ రెండు రంగాలకు కేవలం నాలుగు శాతం నిధులు ఇవ్వడమేంటని నిలదీశారు. విద్యవైద్య రంగాలను పూర్తిగా ప్రయివేటీకరణ చేసే కుట్ర దీని వెనుక దాగి ఉందన్నారు. దేశంలో తాండవిస్తున్న నిరుద్యోగ సమస్య పరిష్కారం గురించి కేంద్ర ప్రభుత్వానికి ఆలోచనే లేదని విమర్శించారు. కేంద్ర బడ్జెట్ తెలంగాణ వ్యతిరేక బడ్జెట్ అని చెప్పారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలకు కేటాయింపులే లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బయ్యారం ఉక్కు కర్మాగారం, హైదరాబాద్‌లో మెట్రో పేస్-2, ఫోర్త్ సిటీ, మూసీ సుందరీకరణకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని అడిగితే మోడీ సర్కారు పట్టించుకోలేదని విమర్శించారు. రాజ్యాంగం, లౌకిక విలువలు, అంబేద్కర్ ఆశయాల కోసం తమ పోరాటాలు ఉండబోతున్నాయని చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. గత బీఆర్ ఎస్ ప్రభుత్వం హామీలను విస్మరించడం వల్లనే ప్రజలు ఆ పార్టీని కాదని కాంగ్రెస్‌కు అవకాశమిచ్చారనీ, కాంగ్రెస్ కూడా బీఆర్ ఎస్ బాటలోనే నడుస్తున్నదని విమర్శించారు. రైతులకు, కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని చెప్పారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ ఎస్ పార్టీ మతోన్మాద రాజకీయాలపై తన వైఖరేంటో చెప్పకుండా అవకాశవాదంతో ముందుకెళ్తున్నదని విమర్శించారు. బీజేపీ పట్ల తన వైఖరేంటో స్పష్టపర్చాలని బీఆర్ ఎస్‌ను డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) పార్టీ విస్తరించడానికి బలమైన ఉద్యమాలే కీలకం కాబోతున్నాయన్నారు. విస్తృత పోరాటాల ద్వారా ప్రజలకు చేరువవుతామని చెప్పారు. వామపక్ష పార్టీలను కలుపుకుని రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను ఏర్పాటు చేసేందుకు సీపీఐ(ఎం)గా చొరవ తీసుకుంటామని ప్రకటించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్రంగానే పోటీచేస్తామనీ, అదే సమయంలో సీపీఐ, ఇతర వామపక్షాలు బలంగా ఉన్న చోట్ల పరస్పర సహకారంతో ముందుకెళ్తామని ప్రకటించారు. వామపక్ష పార్టీల ఐక్యత తమకు తొలి ప్రాధాన్యం అన్నారు. సొంతంగా పార్టీ శక్తిని పెంచుకునేందుకు, విస్తరించేందుకు కార్యక్రమాలను తీసుకుని ముందుకెళ్తామని చెప్పారు. తాను సామాజిక సమీకరణాల రీత్యా ఈ పదవిలోకి రాలేదనీ, సీపీఐ(ఎం) మహాసభ ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నుకుంటే కార్యదర్శిని అయ్యానని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. తమ పార్టీ మహాసభలో రైతులు, పేదలు, కూలీలు, కార్మికులకు మేలు జరిగేలా 49 అంశాలపై తీర్మానాలు చేశామనీ, ఆ దిశగానే పోరాటాలుంటాయని చెప్పారు. కనీస కూలి రూ.400 కోసం, 200 పనిదినాల అమలు కోసం కొట్లాడుతామని చెప్పారు. కనీస వేతనాలు రూ.26 వేల అమలు కోసం కార్యాచరణ తీసుకుని ముందుకెళ్తామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలు చేస్తామని చెప్పారు.
భూ అక్రమాలకు వ్యతిరేకంగా పోరాట కార్యాచరణ రూపొందించి…రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇండ్ల స్థలాలిచ్చే వరకూ వెనక్కి తగ్గబోమన్నారు. ఓట్లు, సీట్ల ఆధారంగా చూడకుండా ప్రజా ఉద్యమాల ద్వారా కమ్యూనిస్టుల శక్తిని చూడాలన్నారు. తమ హక్కుల కోసం పోరాటాల్లో కలిసి వస్తున్న ప్రజలకు రాజకీయ చైతన్యం కల్పించడంలో కొంత వైఫల్యం ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. ఆ ప్రజలను పోరాటాల వరకే కాకుండాఎన్నికల్లోనూ కమ్యూనిస్టుల వైపు ఉండేలా చైతన్యం కల్పించడంపై దృష్టి సారిస్తామని నొక్కి చెప్పారు. డబ్బు, మద్యం, ప్రలోభాలతో ఎన్నికలు జరుగుతున్న కాలంలో ప్రజలకు మరింత చైతన్యం కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద చర్చల కంటే వ్యక్తిగత దూషణలకు ప్రాధాన్యం ఇవ్వడంపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని ప్రజలంతా గమనిస్తున్నారనీ, ప్రజాప్రతినిధులు తమ మాటతీరును మార్చుకోవాలని సూచించారు. బూర్జువా పార్టీలకు అధికార యావ తప్ప ప్రజా సమస్యల పరిష్కారం పట్ల దృష్టి సారించవని ఎత్తిచూపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామనటాన్ని, ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నామనీ, అయితే, జనాభా లెక్కల్లో మరింత స్పష్టత తీసుకొచ్చి 2021 జనాభా లెక్కల ప్రకారం అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ లెక్కల్లో వివరాలు సరిగా లేకపోవడాన్ని తప్పుబట్టారు.