–ఎస్‌ఎల్‌బిసి సొరంగం పనుల సందర్శనలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
Julakanti Ranga Reddy:ప్రజా దీవెన, దేవరకొండ: నల్లగొండ జిల్లాకి శాశ్వత నీటి పరిష్కారానికి ఎస్‌ఎల్‌బిసి సొరంగమే శరణ్య మని, ఈ సొరంగానికి రాబోయే శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో (Legislature Budget Session) తగిన నిధులు కేటాయించి యు ద్దప్రతిపదికన కాలపరిమితి నిర్ణ యించి పూర్తి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి (Julakanti Ranga Reddy), సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి (Mudireddy Sudhakar Reddy) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం నాడు ఎస్‌ఎల్‌బిసి సొరంగం పనులను సీపీఎం ప్రతినిధి బృందం పరిశీలించింది. వారు ఈ సందర్భంగా జరుగుతున్న పనులను జెపి అసోసియేట్స్‌ను అడిగి తెలుసుకున్నారు. 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పూర్తి చేస్తుందని జిల్లా ప్రజలకు వాగ్దానం చేశారని గుర్తు చేశారు. గతంలో కేటాయించిన బడ్జెట్ కంటే ఎక్కువ నిధులను కేటాయించి పూర్తి చేయాలని అన్నారు.
సుమారు ఇప్పటి వరకు సొరంగం (tunnel) పనులు 34.37 కిలోమీటర్లు తవ్వారని ఇంకా 9.5 కిలోమీటర్లు తవ్వాల్సి ఉందని అన్నారు. తవ్వాల్సిన టిబిఎం మిషన్స్ మరమ్మతులు చేయాల్సి ఉందన్నారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 8 మాసాలు కావస్తున్న జిల్లా మంత్రులు ఈ ప్రాజెక్టు పూర్తికి కావల్సిన చర్యలు తీసుకోలేదన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గారు ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటన సందర్భంగా పాలమూరు, రంగారెడ్డి, డిరడి ఎత్తిపోతల పథకము గురించి ప్రస్తావించారు తప్పా యస్‌యల్‌బిసి సొరంగం గురించి మాట్లాడలేదన్నారు. శాశ్వత పరిష్కారమైన శ్రీశైలం సొరంగ (Srisailam tunnel) మార్గానికి రెండవ సారి 2005లో ఆనాటి ప్రభుత్వం 1925కోట్లతో పూర్తిచేస్తామని పరిపాలన అనుమతి ఇచ్చింది. అనేక అవాంతరాలు అధిగమించి 2008లో పనులు ప్రారంభించింది. 5 సంవత్సరాల్లో సొరంగ పనులు పూర్తిచేస్తామని ప్రభుత్వం మరియు కాంట్రాక్టు కంపెనీ సంస్థలు ప్రకటించాయి. నేటికీ 18 సంవత్సరాలు గడిచినా సొరంగం పనులు పూర్తి కాకపోవడం ఆందోళనకరంగా ఉందన్నారు. గత ప్రభుత్వం కాలంలో తగిన నిధులు కేటాయించకపోవడంతో పనులు నత్తనడకన నడిచాయని 2018 జులైలో మా ప్రతినిధి బృందం పర్యటించి పనులు జరుగుతున్న తీరును నాటి ఇరిగేషన్ శాఖ మాత్యులు హరీష్‌రావుగారికి మరియు జిల్లా మంత్రి జగదీశ్వర్‌రెడ్డి గారికి పలు మార్లు లేఖలు రాసి ఆందోళనలు చేసిన విషయం గుర్తు చేశారు. అయినా నాటి ప్రభుత్వం నిధుల్లోనూ వివక్షత చూపిందన్నారు.
ప్రభుత్వాలు నిర్ణయించిన కాలపరిమితిలో తగిన బడ్జెట్ (budget) కేటాయించకపోవడం వలన బడ్జెట్ అంచనాలు పెరిగాయని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో సుమారు రూ.2వేల కోట్లను కేటాయించి పూర్తి చేయుటకు కాలపరిమితి నిర్ణయించి పర్యవేక్షణ చేయాలని డిమాండ్ చేశారు. నాటి ప్రభుత్వం భారీ వ్యయంతో, ఎక్కువ నిర్వహణ ఖర్చుతో కూడుకున్న ప్రాజెక్టులకు వేలకోట్లు ఖర్చుచేసి ఆగమేఘాలపై పనులను నడిపిస్తున్న ప్రభుత్వం పైసా నిర్వహణ ఖర్చులేకుండా గ్రావిటిద్వారా నీరువచ్చే ఎస్‌ఎల్‌బిసి సొరంగం (ఎఎమ్మార్పి ) ప్రాజెక్టుకు 1500 కోట్లు ఇస్తే పూర్తయ్యే స్థితిలో ఉంటే పట్టించుకోలేదన్నారు. ఈ ప్రభుత్వమైన నిధులు కేటాయించకపోతే ప్రజలను సమీకరించి పెద్దఎత్తున పోరాటాలు తప్ప మరో మార్గంలేదన్నారు.
నల్లగొండ జిల్లా ప్రజలు దశాబ్దాల పాటు సాగించిన పోరాటాల ఫలితంగా ఎస్‌ఎల్‌బిసి (శ్రీశైలం ఎడమగట్టు కాల్వ) ఆచరణ రూపం దాల్చింది. ఎగువ, దిగువ కాలువల ద్వారా 3లక్షల ఎకరాలకు సాగునీరు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగునీరందించాలని లక్ష్యంగా నాటి పాలకులు నిర్ణయించారు. ఆ తర్వాత కొంతకాలానికి ఉదయసముద్రం ఎత్తిపోతల ద్వారా మరో 1లక్ష ఎకరాలకు సాగునీరిస్తామని ప్రకటించారు. అయితే దీనికి శాశ్వత పరిష్కారం సొరంగమార్గంగా, తాత్కాలికంగా పుట్టంగండి, ఫాల్తీన్ తండాల వద్దనుండి నీటిని లిప్టుల ద్వారా ఆయకట్టుకు సాగునీరు, రక్షిత మంచినీరు అందించుటకు నిర్దేశించారు. పుట్టంగండి నుండి 4 మోటార్లను ఎల్లప్పుడు నడుపుతూ నీరిస్తామని చెప్పిన గత పాలక ప్రభుత్వాలు (టిడిపి, కాంగ్రెస్, భారాస) ఎక్కువ కాలం కేవలం 3 మోటార్లు నడిపించడం, ఇందులో 2 మోటార్ల నీరు హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు 3 పైపులైన్ల ద్వారా సరఫరా చేయడం మరో మోటారు నీరు నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగునీరు అందించడంతో ఎస్‌ఎల్‌బిసి తాగునీటి ప్రాజెక్టుగా మారిపోయింది. ఆయకట్టుకు సాగునీరు ఆరుతడి పంటలకు కూడా అందకుండా పోతున్నది.
2023 శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా యస్‌యల్‌బిసి సొరంగం పూర్తికి కాంగ్రెస్ పూర్తి భాద్యత తీసుకుంటుందన్నారు. ఇప్పటికైనా జూలై 23 నుండి జరిగే శాసనసభ బడ్జెట్ (Legislature budget) సమావేశాలలో ప్రాజెక్టు పూర్తికి తగిన నిధులు కేటాయించడం, కాలపరిమితి నిర్ణయించి యుద్దప్రాతిపదికన పూర్తి చేయాలని సిపిఐఎం కోరుతున్నదని, గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం కూడా సొరంగం ఎడల నిర్లక్ష్యం చేస్తే ప్రజలను సమీకరించి పెద్దఎత్తున ఉద్యమం చేపడుతామని చెప్పారు.ఈ పరి శీలన కార్యక్రమంలో సీపీఎం నాయకులు బొంతల చంద్రారెడ్డి, తుమ్మల వీరారెడ్డి, డబ్బికార్ మల్లేశం, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున, ప్రభావతి, కె.నాగిరెడ్డి, సిహెచ్. లక్ష్మీనారా యణ, వి.వెంకటేశ్వర్లు, కంబాలపల్లి ఆనంద్, వెంకటయ్య, ఎమ్‌డి. సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి, దండెంపల్లి సత్తయ్య, ఊట్కూరి నారాయణరెడ్డి, తుమ్మల పద్మ, మల్లం మహేశ్, కొండా అనురాధ, రాగిరెడ్డి మంగారెడ్డి, కత్తి శ్రీనివాస్‌రెడ్డి, నన్నూరి వెంకటరమణారెడ్డి, ఎం.భిక్షం, ఎన్.సైదులు తదితరులు పాల్గొన్నారు.