Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Krishna : నమ్మిన స్నేహితుడే కాలయముడై

సూర్యాపేట పరువు హత్య కేసులో సంచలన విషయాలు

Krishna : ప్రజా దీవెన, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలో జరిగిన పరువు హత్య కేసులో సంచలన విషయాలు తెలు గులోకి వచ్చాయి. ఆదివారం రాత్రి జరిగిన అనుమానాస్పద పరువు హత్య ఘటనలో 32 ఏళ్ల వి కృష్ణ (32) హత్య కేసులో సూర్యాపేట పోలీసులు నలుగురిపై కేసు నమో దు చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మామిళ్లగడ్డకు చెందిన కృష్ణ తన స్నేహితుడైన నవీన్ సో దరి భార్గవిని ఆరు నెలల క్రితం జిల్లాలోని పిల్లలమర్రి గ్రామంలో అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టంలేని పెళ్లి చేసుకున్నాడు.

ప్రభుత్వ ఉద్యోగితో నిశ్చితార్థం చేసుకున్న తర్వాత, భార్గవి తన కుటుంబాన్ని విడిచిపెట్టి, ఆమె తల్లిదండ్రులకు ఇష్టంలేని కృష్ణను వివాహం చేసుకుంది. కృష్ణ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నవీన్‌, అతని సోదరుడు వంశీ, తండ్రి సైదులు, మరో వ్యక్తి మహేశ్‌ అనే నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ(30) బీఫార్మసీ చదువుతూ మధ్యలో ఆపేశాడు.

సూర్యాపేట పట్టణంలోని పిల్లలమర్రి ప్రాంతానికి చెందిన కోట్ల నవీన్‌ అనే వ్యక్తి తమ ప్రాంతంలో నాయకుడిగా ఎదగాలనే లక్ష్యంతో అనుచరులను పెంచుకుంటున్నాడు. ఇందులో భాగంగా కృష్ణతో స్నేహం పెంచుకున్నాడు. అతన్ని నవీన్‌ తరచూ తన ఇంటికి తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో నవీన్‌ చెల్లెలు భార్గవితో కృష్ణకు పరిచయం ఏర్పడింది.

క్రమంగా అది ప్రేమగా మారింది. ఈ విషయం చుట్టుపక్కల వారికి తెలియడంతో కృష్ణను నవీన్‌ పలుమార్లు హెచ్చరించాడు. ఆమె బంధువులు సైతం బెదిరించారు.

ప్రేమించాడన్న నెపంతో దారుణంగా చంపి నదిలో విసిరేసి..

నవీన్‌ మిత్రుడు బైరు మహేశ్‌ రెండు నెలలుగా కృష్ణతో స్నేహం చేస్తున్నాడు. చిన్న, చిన్న సెటిల్‌మెంట్లు చేస్తూ.. కృష్ణకు డబ్బులు పంచేవాడు.

ఓ సెటిల్‌మెంట్‌ కుదిరిందని.. కృష్ణకు ఆదివారం మహేశ్‌ ఫోన్‌ చేసి.. సాయంత్రం 5 గంటలకు తన వద్దకు రమ్మన్నాడు. తనను కలిసేందుకు వచ్చిన కృష్ణను మహేశ్‌ తన వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లినట్లు సమాచారం.

కృష్ణ ఇంటికి తిరిగిరాకపోవడంతో ఆదివారం రాత్రి 7 గంటలకు మహేశ్‌ సెల్‌ఫోన్‌కు భార్గవి ఫోన్‌ చేసింది. కృష్ణ బిజీగా ఉన్నాడని, పది నిమిషాల తర్వాత మాట్లాడిస్తామని అతను చెప్పారు. కొద్దిసేపటికి మహేశ్‌ ఫోన్‌ నుంచి భార్యకు కృష్ణ కాల్‌ చేసి.. పది నిమిషాల్లో ఇంటికి వస్తానని చెప్పాడు.

కానీ, తిరిగిరాలేదు. సోమవారం తెల్లవారుజామున పురపాలిక పరిధిలోని పిల్లలమర్రి సమీప మూసీ కాలువ కట్టపై కృష్ణ మృతదేహం లభించింది. తలపై గాయాలు, మెడ చుట్టూ, శరీరంపై కమిలిన గుర్తులు, నాలుక బయటకు వచ్చి ఉండడంతో గొంతు నులిమి.. బండరాయితో మోది చంపిఉంటారని అనుమానిస్తున్నారు.

మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి పోలీసులు తరలించారు. నాలుగు బృందాలు ఏర్పాటు చేసి.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని సూర్యాపేట డీఎస్పీ రవి తెలిపారు. అత్తింటివారే తన కుమారుడిని హత్య చేశారని కృష్ణ తండ్రి డేవిడ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవి అన్న నవీన్, తమ్ముడు వంశీ, తండ్రి సైదులు, మహేశ్‌పై హత్య, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.