–అధికారుల తీరుపై సర్వత్ర విమర్శలు
Lab Technicians : ప్రజాదీవెన , నల్గొండ : వారంతా ల్యాబ్ టెక్నీషియన్లు.. నిత్యం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వచ్చే రోగుల నుండి రక్తాన్ని సేకరించి పరీక్షించేవారు. అకస్మాత్తుగా బుధవారం వారంతా కూలీల అవతారం ఎత్తి కూలి పని చేసారు. ఈ విషయంపై అధికారుల తీరుపై సర్వత్వ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల లో భాగంగా ఆస్పత్రిలో ఉన్న టీ హబ్, ఎక్స్ రే, పైథాలజీ, బ్లడ్ బ్యాంక్ శాఖలను మరొక చోటికి మార్పు చేస్తున్నారు. అయితే టి హబ్ పరీక్ష కేంద్రాన్ని మరొక చోటికి తరలిస్తున్న తరుణంలో వర్కర్లు లేక టి హబ్ లో పనిచేసే ల్యాబ్ టెక్నీషియన్లు కూలీలుగా మారిపోయారు.
అక్కడ ఉన్న వస్తువులను వారే స్వయంగా మరొక చోటికి తీసుకువెళ్లారు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రి అధికారులపై మండిపడుతున్నారు. అధికారులు వర్కర్ల ఏర్పాటు చేసి వారి చేత పనిచేయించకుండా రక్త పరీక్షలు చేయాల్సిన సిబ్బంది చేత కూలి పని చేయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇదే విషయం పై పలువురు ల్యాబ్ టెక్నీషియన్లను సంప్రదించగా అధికారులు వర్కర్లను ఏర్పాటు చేయకుండా తమతో పని చేపిస్తున్నారని ఆవేదన చెందారు. గతంలో కూడా ఇలా అనేకమార్లు పనులు చేయించారని, వర్కర్లను పెట్టి పనులు చేయించాల్సింది పోయి మా చేత పనులు చేయించి వర్కర్ల చేత పనులు చేయించినట్లు గతంలో బిల్లులు కూడా డ్రా చేసినట్లు వారు ఆరోపిస్తున్నారు. అధికారులు వర్కర్ల చేత చేయించాల్సిన పనిని తమ చేత చేయించడం ఏంటని ఒకపక్క ప్రశ్నిస్తునే మరోపక్క చేసేదేమీ లేక అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా టీ హబ్ సిబ్బంది చేత కూలి పనులు చేయించడం సర్వత్ర విమర్శలకు దారితీసింది.
ప్రతి డిపార్ట్మెంట్ కు నలుగురు వర్కర్లను ఇచ్చాం..
డాక్టర్ అరుణ కుమారి (ఇన్చార్జి సూపరిండెంట్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నల్గొండ)
పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు ఉన్నాయి. పనుల నిమిత్తం ప్రతి డిపార్ట్మెంట్ కు నలుగురు వర్కర్లలను ఇచ్చాం. వారికి సహకరించమని టెక్నీషియన్లకు చెప్పాము. టీ హబ్ ఏ కాకుండా బ్లడ్ బ్యాంక్, ఎక్స్ రే, పైథాలజీ శాఖలను, ఓపి బ్లాక్ ను కూడా షిఫ్ట్ చేస్తున్నాము. అందరం కలిసి పనిచేస్తేనే పనులు త్వరగా పూర్తవుతాయి. లేదంటే రోగులకు ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. ప్రతిరోజు పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నాను. ఒకటి, రెండు రోజుల్లో పనులు పూర్తవుతాయి.