అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల నివారణ దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు…
Plastic Ban : ప్రజాదీవెన, సూర్యాపేట : పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయంగా వస్త్ర సంచులను వినియోగించాలని సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ సిహెచ్. హన్మంతరెడ్డి సూచించారు. అంతర్జాతీయ ప్లాస్టిక్ సంచుల నివారణ దినోత్సవం సందర్భంగా మున్సిపాలిటీ 100 రోజుల కార్యచరణలో భాగంగా తాళ్లగడ్డ 29వ వార్డులో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్లాస్టిక్ భయంకరమైన వాతావరణ ముప్పుగా మారిందని, ప్రతి ఒక్కరూ ఆపై జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ హనుమంత్‌రెడ్డి స్థానికులకు క్లాత్ బ్యాగులను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న గ్రీన్ క్లబ్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు ముప్పారపు నరేందర్, టెర్రస్ గార్డెన్ అసోసియేషన్ నిర్వాహకులు నల్లపాటి మమతా శ్రీకాంత్‌ను ఘనంగా సన్మానించారు.
సూర్యాపేట పట్టణ ప్రజలందరూ ప్లాస్టిక్ నిషేధానికి సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డీఈఈ సత్యారావు, సానిటరీ ఇన్‌స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ శివప్రసాద్, టీఎంసీ శ్వేత, మాజీ కౌన్సిలర్ ఆనంతుల యాదగిరి, గ్రీన్ క్లబ్ కార్యవర్గ సభ్యుడు మిరియాల వెంకటేశ్వర్లు, జవాన్ వేణు, ఆర్పీలు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.