Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Madhavaram Krishna Rao : కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు భూముల వేలం హైటెన్షన్

Madhavaram Krishna Rao : ప్రజా దీవెన,హైదరాబాద్: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డ్ పరిధిలోని భూములను వేలం వివాదాస్పదంగా మారింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య కేపీహెచ్‌బీ భూమలు వేలం కొనసాగుతోంది. ఈ వేలంపాటలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులు డీడీలతో సహా వచ్చారు. ఈ దశలో మొత్తం 23 స్థలాలను విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. కాగా.. రోడ్డు విస్తరణలో కోల్పోయే ప్లాట్లను ప్రజలకు అమ్మి మోసం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్లు పరిగణలోకి తీసుకోకుండా ఫ్లాట్లను అమ్మడంతో ప్రజలు నష్టపోతారంటూ ఆందోళనకు దిగారు.

 

ఈ వేలం కార్యక్రమాన్ని అడ్డుకుంటామని బీఆర్ఎస్ నేతలతో పాటు బీజేపీ, జనసేన నాయకులు కూడా హెచ్చరించటంతో.. పలువురు ముఖ్య నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇందులో భాగంగానే.. కూకట్‌పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మరోవైపు.. హౌసింగ్‌బోర్డు అధికారులతో వేలంపాటకు వచ్చిన బిడ్డర్లు గొడవకు దిగారు. కోర్టు కేసులున్న భూములను తమకెందుకు అమ్ముతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులకు, బిడ్డర్లకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇదిలా ఉంటే.. వేలంపాటపై కేపీహెచ్‌బీ ఫేజ్‌-15 కాలనీ వాసులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

 

విచారణ చేపట్టిన న్యాయస్థానం.. మధ్యాహ్నం 2.15 వరకు టెండర్ల ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించింది. మాస్టర్‌ప్లాన్‌ను సమర్పించాలని అధికారులను ఆదేశించింది. కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డులో మొత్తం 28 ఫ్లాట్లను హౌసింగ్ బోర్డ్ అధికారులు వేలం వేస్తుండగా.. హైకోర్టు స్టే తో 9వ ఫేజ్ మినహాయించి.. మిగిలిన ప్లాట్లకు అధికారులు వేలం నిర్వహిస్తున్నారు.

 

ఈ పరిణమాలన్నింటి మధ్య నిర్వహిస్తున్న కేపీహెచ్‌బీ భూముల వేలంలో హైటెన్షన్ నెలకొంది. భారీ పోలీసుల బందోబస్తు నడుమ భూముల వేలం కొనసాగుతోంది. కాగా.. కేపీహెచ్‌బీలో భూముల వేలాన్ని జనసేన నేతలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. వేలం ప్రాంగణానికి వచ్చిన జనసేన నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులకు, జనసేన నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నేతల ఆందోళన నేపథ్యంలో హౌసింగ్ భూముల వేలం వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది.

 

కాగా.. కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డు కాలనీ పరిధిలో మిగిలిన ప్లాట్లను వేలం వేయనున్నట్లు గృహ నిర్మాణ శాఖ కమిషనర్‌, బోర్డు వైస్‌ చైర్మన్‌ వి.పి.గౌతమ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. గృహ నిర్మాణ పథకాల అమలుకు వీలు కాని చిన్నచిన్న విస్తీర్ణం కలిగిన ప్లాట్లను, గృహాల మధ్య అక్కడక్కడ మిగిలిపోయిన ప్లాట్లనే వేలం వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే హౌసింగ్‌ బోర్డు పరిధిలో ఉన్న 700 ఎకరాల భూములు అన్యాక్రాంతం కాకుండా తగిన చర్యలు తీసుకున్నామని గౌతమ్‌ వెల్లడించారు.