–మెట్రో రైలు ప్రయాణ వల్లనే డిగ్రీ పూర్తి చేశాను
–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Collector Ila Tripathi : ప్రజాదీవెన నల్గొండ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం వల్ల ఎంతో మంది మహిళలు వారు అనుకున్నది సాధించగలుగుతున్నారని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం లో భాగంగా 200 కోట్ల ఉచిత ప్రయాణం మైలురాయి దాటిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న సంబరాల లో భాగంగా బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బస్ డిపో, బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన ఉచిత బస్సు ప్రయాణ సంబరాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తాను ఢిల్లీలో విద్యార్థిగా ఉన్న సమయంలో ఢిల్లీ మెట్రో రైలు ప్రయాణ సౌకర్యం వల్లనే డిగ్రీ ని పూర్తి చేయగలిగానని తెలియజేశారు.
తనలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం ఎంతోమంది మహిళలు చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాల నిర్వహణకు ఎంతగానో మేలు చేస్తున్నదని తెలిపారు. ఉచిత బస్సులలో ఎక్కువమంది మహిళా కండక్టర్లు, డ్రైవర్లు ఉంటే ఇంకా బాగుంటుందని రీజనల్ మేనేజర్ కు సూచించారు. ఉచిత బస్సు ప్రయాణం 200 కోట్ల మైలురాయి దాటేందుకు కృషిచేసిన ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందికి ఆమె అభినందనలు తెలియజేశారు. నల్గొండ రీజినల్ మేనేజర్ కే. జానిరెడ్డి, డిప్యూటీ రీజినల్ మేనేజర్ సుచరిత, నల్గొండ డిపో మేనేజర్ శ్రీనాథ్ మాట్లాడారు. ఆర్టీసీలో 200 కోట్ల ఉచిత ప్రయాణం మైలు రాయి దాటిన సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన మధుశ్రీ, దీక్షిత, కరుణప్రియ, శ్రీలక్ష్మి, ఎస్ కే. ఆఫ్రిన్లకు జిల్లా కలెక్టర్ బహుమతులు అందజేశారు. అలాగే రెగ్యులర్ గా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసిన మాధవి, జ్యోతి, గీత, ఉష, అనసూయ లను జిల్లా కలెక్టర్ శాలువా జ్ఞాపికలతో సన్మానించారు.
— అభినందించకుండా ఉండలేకపోతున్నాను..
మాధవి (సన్మాన గ్రహీత ఆర్టీసీ ఉచిత ప్రయాణికురాలు)
రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం లో భాగంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రవేశపెట్టిన మొదట్లో పథకం ఎలా ఉంటుందో అని అనుకున్నాను. ఇది అమలు చేయడం చాలా కష్టమని భావించాను. అయితే ప్రభుత్వం ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేసింది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను. మహిళలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇంకా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఆర్టీసీ బస్సులో మహిళలకు భద్రత బాగుంటుంది. వైద్య చికిత్సల నిమిత్తం నిమ్స్ లాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ కి వెళ్ళేందుకు ఉచిత ప్రయాణం చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఆర్టీసీ సప్తక్షేత్రాల సందర్శనకు ఏర్పాటు చేసిన బస్సు సౌకర్యం ద్వారా నేను ఉచితంగా ప్రయాణం చేసి సద్వినియోగం చేసుకున్నాను. మహిళల కోసం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ప్రవేశపెట్టినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు.