–ప్రజా సంఘాలు పిలుపు
Rural Bandh : ప్రజాదీవెన నల్గొండ : ఈ నెల 9 న జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మె, గ్రామీణ బందులో కార్మిక వర్గం, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి. నాగయ్య, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. బుధవారం దొడ్డి కొమరయ్య భవన్ లో జరిగిన ప్రజాసంఘాల సమావేశంలో వారు మాట్లాడుతూ అఖిల భారత కార్మిక సంఘాల పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా జూలై 9 న, కేంద్రం తెచ్చిన కార్మిక చట్టాల సవరణకు వ్యతిరేకంగా జరిపే సమ్మె, ప్రజలపై భారాలు, నిత్యవసర సరుకుల ధరలు, రైతు వ్యవసాయ కార్మిక మహిళా సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందడాన్ని నిరసిస్తూ నిర్వహించే గ్రామీణ బందులో అధిక సంఖ్యలో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలతో పాటు సమస్యలతో సతమతమవుతున్న ప్రజలందరూ పాల్గొనాలని పిలుపు ఇచ్చారు.
గత కొంతకాలంగా ప్రజలు, రైతాంగం, కార్మికులు సుదీర్ఘ పోరాటాల ద్వారా ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ ల పేరుతో కార్మిక వర్గ హక్కులను రద్దు చేస్తామంటే కార్మిక వర్గం చూస్తూ ఊరుకోదని, కార్మిక వర్గ పోరాటాల ద్వారా బుద్ధి చెబుతామని అన్నారు. కార్మికులకు సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు లేకుండా, కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్ ను కఠినతరం చేసి, కార్మికులను సంఘాల నుండి దూరం చేసేందుకు దీని ద్వారా పెట్టుబడిదారుల దోపిడీని విస్తృత పరిచేందుకు కేంద్రం తీసుకొచ్చిన కార్మిక చట్టాలను కార్మిక వర్గం ఐక్యంగా ప్రతిఘటించాలని కోరారు.కార్మిక వర్గాన్ని ఐక్యం కానీయకుండా విభజన రాజకీయాలను పెంచేందుకు, కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను అప్పగించేందుకు, కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చేందుకు కేంద్రం కార్మిక చట్టాలను సవరించిందని విమర్శించారు.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్మిక హక్కులను నిర్వీర్యం చేయడం కార్మిక చట్టాలకు సవరణ చేసి,కార్మిక సంఘాల నిర్వీర్యం చేసి కార్పోరేట్ శక్తులను దేశాన్ని అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగానే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చామని తెలిపారు.కార్మిక వర్గానికి శ్రమకు తగ్గ ఫలితం దక్కనీయకుండా కనీస వేతనాలు అందించకుండా,ఎటువంటి సామాజిక భద్రత పథకాలు అమలు చేయకుండా చేసేందుకు నాలుగు లేబర్ కోడ్ లను కేంద్రం తీసుకొచ్చిందని విమర్శించారు.జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో అన్ని రంగాల కార్మికులు రైతులు వ్యవసాయ కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ప్రజాసంఘాల నాయకులు నారి ఐలయ్య, పాలడుగు నాగార్జున, ప్రభావతి, కందాల ప్రమీల, శ్రీశైలం, గంజి మురళీధర్, అవిశెట్టి శంకరయ్య, ఎండి సలీం, సత్తయ్య, శ్రీనివాస్, పరుషరాములు, మహేష్, పోలబోయిన వరలక్ష్మి, కొండ అనురాధ, వెంకన్న, శంకర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.