–నాలుగు సంవత్సరాలుగా రాని బిల్లులు
–సిబ్బంది సహాయనిరాకరణ, భవన యజమాన్యాల వేధింపులు
–మారం నాగేందర్ రెడ్డి
Maram Nagender Reddy : ప్రజాదీవెన నల్గొండ : మహాత్మ గాంధీ విశ్వవిద్యాలయ పరిధి లోని డిగ్రీ కళాశాలల కు 4 సంవత్సరాల ఆర్ టి ఎఫ్, ఎం టి ఎఫ్ బకాయిలు రాక ఇబ్బందుల పడుతున్న దృష్ట్యా డిగ్రీ పరీక్షలు నిర్వహించలేమని తెలంగాణ అఫిలేటెడ్ డిగ్రీ, పీజీ కళాశాల మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు నాగేందర్ రెడ్డి స్పష్టం చేశారు. విషయాన్ని తెలుపుతూ బుధవారం మహాత్మా గాంధీ యూనివర్సిటీ విసికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల తరపున ప్రభుత్వo చెల్లించే ఫీజుల ద్వారా మాత్రమే నడుపబడుతున్న ప్రైవేట్ డిగ్రీ కళాశాలలకు గత 4 సంవత్సరాల నుండి ఆర్టిఎఫ్, ఎంటిఎఫ్ చెల్లించకపోవడం వలన, అనేక మంది పేద విద్యార్థులు, కళాశాల యాజమాన్యాలు అనేక రకాల ఇబ్బందులకు గురి అవుతున్నారని ఆవేదన చెందారు.
ఈ విషయం పై గత 9 నెలలుగా వివిధ రూపంలో నిరసన తెలియజేసినప్పటికు ప్రభుత్వం నుండి స్పందన లేదు. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో ని కొన్ని జిల్లాలకు మాత్రమే కొంతమేరకు నిధులు విడుదల చేసారు. కానీ మహాత్మ గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని ఉమ్మడి నల్లగొండ జిల్లా కు చెందిన కళాశాలలకు ఫీజు బకాయులు చెల్లించడంలేదు. రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలోని విద్యార్థులు పై వివక్ష చూపుతున్నారు. ఈ నిస్సాహయ పరిస్థితిలో కళాశాలలో పనిచేసే అధ్యాపకులకు గత 6 నెలలుగా జీతాలు, భవన యజమాన్యాలకు అద్దె చెల్లించడం లేదని పేర్కొన్నారు. కావున కళాశాల సిబ్బంది సహాయనిరాకరణ, భవన యజమాన్యాల వేధింపుల కారణంగా త్వరలో జరుగబోయే డిగ్రీ సెమిస్టర్ పరీక్షలను నిర్వహించే స్థితిలో లేమని తెలిపారు. విసిని కలిసిన వారిలో అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.