–రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమా టోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Minister Komatireddy Venkata Reddy : ప్రజా దీవెన , నల్లగొండ : రాష్ట్రప్రభుత్వం ప్రాథమిక విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్రరోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.బుధవారం అయన నల్గొండ జిల్లా, కనగల్ మండల కేంద్రంలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు.
కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయ పాఠశాలను సందర్శించిన అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ.నల్గొండ జిల్లా, కనగల్ పి హెచ్ సి లో తెలంగాలొనే మొట్టమొదటిసారిగా కంటి వ్యాధులకు సంబంధించిన గ్లూకోమో సెంటర్ ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. రోగం రాకముందే పరీక్షల ద్వారా గుర్తించినట్లయితే ఎలాంటి జబ్బుల బారినపడకుండా ఉండొచ్చని అన్నారు. ముందుగా తన నియోజకవర్గంలో ఇలాంటి పైలెట్ ప్రాజెక్టు ప్రారంభించడం జరిగిందని, అనంతరం జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా గ్లూకోమో కేంద్రాలను ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల లో భాగంగా గడచిన 15 నెలల్లోనే 1600 కోట్ల రూపాయల ఎల్ ఓసీలను అందించడం జరిగిందన్నారు. ఎవరైనా పేద ప్రజలు వైద్యం కోసం వస్తే 24 గంటలు ఎల్ఓసిని అందజేస్తున్నామని, అయితే ప్రైవేటు ఆసుపత్రులకు ఎల్ఓసి ఇచ్చేబదులుగా ఇక పై ప్రభుత్వ ఆసుపత్రులలోనే అన్ని రకాల సౌకర్యాలతో తీర్చిదిద్దేందుకు గాను హైదరాబాదులో 4 టిమ్స్ హాస్పిటళ్లను ఆర్ అండ్ బి ద్వారా నిర్మాణం చేపట్టనున్నామని తెలిపారు.
వరంగల్ లో 24 కోట్ల రూపాయలతో ఎంజీఎం లో సూపర్ స్పెషాలిటీగా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఇకపై ప్రైవేటు ఆసుపత్రికి బదులుగా ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఎల్ ఓ సి ఇచ్చే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఉస్మానియా ఆసుపత్రిలో నూతన భవన నిర్మాణానికి 2600 కోట్లతో గోషా మహల్ స్టేడియంలో నూతన భవనాన్ని నిర్మిస్తున్నామని, పాత భవనం అలాగే కొనసాగుతుందని వెల్లడించారు.కనగల్ లో ఏర్పాటు చేసిన గ్లూకోమా సెంటర్ పై జిల్లాలోని ప్రజలందరికి అవగాహన కల్పించాలని, వచ్చేవారం దేవరకొండ నియోజకవర్గం లో గ్లూకోమా కేంద్రాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.
నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో నిర్మించిన క్రిటికల్ కేర్ యూనిట్ ను ఈనెలాఖరుకు ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అంతేకాక నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఇతర ప్రాంతాలలో డిప్యూటేషన్ పై పనిచేస్తున్న 59 మంది డాక్టర్లను వెనక్కి పిలిపిస్తున్నామని తెలిపారు. ఏ ఒక్క పేదవాడు ప్రైవేట్ ఆస్పత్రికి వేళ్ళకుండా ప్రభుత్వ ఆసుపత్రి ద్వారానే పూర్తి వైద్య సేవలు అందిస్తామని ఆయన వెల్లడించారు.
జిల్లా కలెక్టర్ జిల్లా ఇలా త్రిపాఠి మాట్లాడుతూ తెలంగాణలో ఎక్కడ లేనివిధంగా పైలెట్ పద్ధతిన కనగల్ ప్రభుత్వ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో గ్లూకోమా సెంటర్ ను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. రానున్న వారంలో 300 రేటినల్ ఇమేజెస్ సేకరించి వారి దృష్టికి సంబంధించిన వ్యాధులపై గ్లూకోమా మిషన్ ద్వారా పరీక్షించనున్నామని, కనగల్ తో పాటు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ గ్లూకోమా కేంద్రం సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రానున్న రోజుల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక మోడల్ పీహెచ్ సిని తీర్చిదిద్దనున్నామని తెలిపారు.
అధికారులు,మాజీ ప్రజా ప్రతినిధులు,తదితరులు ఉన్నారు.