–24 గంటలు సేవ చేసే పోలీసులకు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయం
— కొత్త క్వార్టర్ల నిర్మాణానికి సీఎం తో మాట్లాడి మంజూరు చేయిస్తా
— మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Minister Komatireddy Venkata Reddy : ప్రజాదీవెన , నల్గొండ : ప్రతి మనిషి జీవితంలో క్రీడలు చాలా ముఖ్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ముఖ్యంగా పోలీసులకు శారీరక ధారుఢ్యాన్ని పెంపొందింప జేసుకోవడంలో క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. నల్గొండ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో 3 రోజులపాటు నిర్వహిస్తున్న వార్షిక క్రీడలు, గేమ్స్ పోటీల ముగింపు సమావేశం శనివారం నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
అందరికీ 24 గంటలు సేవ చేసే పోలీసులకు క్రీడా పోటీలు నిర్వహించడం సంతోషమని అన్నారు. పోలీసుల కొత్త క్వార్టర్ల నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి వెంటనే మంజూరు చేయిస్తామని తెలిపారు. జిల్లాలో పోలీసులు మత్తు పదార్థాల నియంత్రణకు చాలా కృషి చేశారని, నల్గొండ జిల్లాను పూర్తిగా మాదక ద్రవ్య రహిత జిల్లా గా తీర్చిదిద్దేదుకు కృషి చేయాలని కోరారు. మత్తుపదార్థాల కారణంగా యువత పక్కదారి పడుతున్నారని, అలా కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని తెలిపారు.
అలాగే జిల్లాను ప్రశాంతంగా ఉంచడంలోనూ, రానున్న రంజాన్ పండుగను ప్రశాంత వాతావరణంలో, సోదర భావంతో కలిసిమెలిసి జరుపుకోవడంలో ప్రతి ఒక్కరు సహకారం అందించాలని, పోలీసులు ఎల్లప్పుడూ శాంతిభద్రతలను కాపాడాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ రెవెన్యూ, పోలీస్ క్రీడ పోటీలను నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు. పోలీసులకు క్రీడా స్ఫూర్తి చాలా అవసరం అని అన్నారు.
క్రీడల్లో గెలుపోటములు సహజమైనప్పటికీ క్రీడల ద్వారా అనేక అంశాలను నేర్చుకోవచ్చని, విజయం కంటే కృషి గొప్పదని అన్నారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ పోలీస్ వార్షిక క్రీడలు, గేమ్స్ పోటీల సందర్భంగా సుమారు 600 మంది పోలీసులు పాల్గొన్నారని తెలిపారు. నల్గొండ, దేవరకొండ, మిర్యాలగూడ తో పాటు, అన్ని డివిజన్ల పోలీసులు ఈ క్రీడల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో మెడల్స్ సాధించిన పోలీస్ లు జిల్లా పోలీసులలో ఉన్నారన్నారు.
పోలీస్ పరేడ్ మైదానంలో సిసి రోడ్లతో పాటు, డార్మెటరీ గదుల మరమ్మతుకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అడిగిన వెంటనే సహాయం చేసినందుకు ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్రీడలలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు. కాగా మూడు రోజుల పాటు నిర్వహించిన క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు ఆర్ అండ్ బి శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్, ఎస్పీలు బహుమతులను అందజేశారు.