మధురాపురంలో మంత్రి సీతక్క*
Minister Sitakka: ప్రజా దీవెన, ఫరూక్నగర్: మహిళలు ఇంటిని చక్కదిద్దడమే కాదు.. అవకాశం ఇస్తే దేశాన్ని కూడా చక్కగా దిద్దుతారు.. అందుకే మహిళా శక్తిని ప్రోత్సహించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకే ప్రాధాన్యత నిస్తూ పాలనను ముందుకు నడుపుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఫరూక్ నగర్ మండలం మదరాపురం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్” ఆధ్వర్యంలో శనివారం వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో మంత్రి పాల్గొన్నారు.
గ్రామంలో కమ్మదనం – మధురాపూర్, శేరిగూడ వరకు గ్రామాల మధ్య రూ . 8 కోట్లతో రెండు లైన్ల బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఆమె, అనంతరం నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ భవనం, మహిళా సమాఖ్య భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె నియోజకవర్గ పరిధిలోని మహిళా సంఘాలకు 50 కోట్ల రూపాయల చెక్కును అందించారు. అనంతరం మాట్లాడుతూ సమాజాన్ని బాగు చేసే శక్తి మహిళలకే ఉందని ఆమె పేర్కొన్నారు. అందుకే మహిళల కోసం ఉచిత బస్సు ఏర్పాటు చేయడమే కాకుండా 5 00 కే గ్యాస్, ఉచిత విద్యుత్ వంటి పథకాలను తీసుకువచ్చారని ఆమె అన్నారు.
కళ్లల్లో నిప్పులు..
మహిళలకు ఉచిత బస్సు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇస్తే బీఆర్ఎస్ నాయకులు కళ్ళల్లో నిప్పులు పోసుకోవడమే కాకుండా మహిళల పట్ల చులకనగా మాట్లాడుతున్నారని, అవహేళన చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. గత ప్రభుత్వం 200 ఎకరాల పైన ఉన్న రైతులకు కూడా రైతు భరోసా, ఉచిత కరెంట్ ఇచ్చింది తప్ప నిరుపేదల కోసం ఒక యూనిట్ కరెంటు కూడా ఉచితంగా ఇవ్వలేదని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం వచ్చాకే నిరుపేదలను గుర్తించి వారి కోసం 200 యూనిట్ల కరెంటును ఉచితంగా అందజేస్తుందని అన్నారు.
ఇది మాత్రమే కాకుండా త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామని, సంక్రాంతికి సన్న బియ్యం రేషన్ షాపుల ద్వారా ఇస్తామని ఆమె హామీ ఇచ్చారు. సావిత్రిబాయి పూలే మహిళల కోసం, వారి విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని కానీ ఏనాడు గత ప్రభుత్వం ఆమెను గుర్తించలేదని అన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆమె జయంతిని అధికారికంగా నిర్వహించడమే కాకుండా, ఆరోజున మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించారని అన్నారు. త్వరలోనే వ్యవసాయ కూలీలుగా పని చేసే నిరుపేదలకు ఏడాదికి 12,000 అందజేస్తామని వెల్లడించారు. రేషన్ కార్డుల పంపిణీ కూడా త్వరలోనే జరుగుతుందని స్పష్టం చేశారు.
మహిళల కోసం 15 వ్యాపారాలు..
మహిళా శక్తిని వెలికి తీయడంలో భాగంగా 15 రకాల వ్యాపారాలను ప్రభుత్వం రూపొందించిందని, దీనికి వడ్డీ లేని రుణాలు అందించి ప్రోత్సహిస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. మహిళా క్యాంటిన్లు, మహిళా కుట్టుమిషన్లు, మహిళా ఈవెంట్లు, పిల్లల స్కూల్ యూనిఫామ్ లు తయారు చేసే బాధ్యత, 32 జిల్లాలలో చేపల వృత్తి వృత్తిలో ఉన్నవారికి పది లక్షల రుణం ఆరు లక్షల మాఫీతో అందించడం వంటివి మాత్రమే కాకుండా 32 జిల్లాలలో 150 బస్సులు మహిళలు నడుపుకునేందుకు వీలుగా ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా చేపల వృత్తిలో ఉన్న వారికి చేపలను సరఫరా చేసేందుకు వాహనాలను కూడా అందజేస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రోత్సాహాన్ని ఉపయోగించుకొని మహిళలు కోటీశ్వరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇంటింటికి పేపర్లు వేయడం, ఇంటింటికి పాలు అమ్మడం తో మొదలుపెట్టి పారిశ్రామిక వేత్తలుగా, వ్యాపారులుగా ఎదిగిన వారు ఎందరో ఉన్నారని మహిళలు అవకాశం ఇస్తే వారికి ఏమాత్రం తీసి పోరని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యేకు ప్రశంసలు..*
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గురించి మంత్రి సీతక్క ప్రత్యేకంగా ప్రశంసలు వర్షం కురిపించారు. నియోజకవర్గం ప్రగతి కోసం శంకరన్న నిరంతరం శ్రమిస్తున్నారని, ఏ అవసరం ఉన్న తన దగ్గరికి వచ్చి వినతి పత్రాలు ఇచ్చి నిధులు అడుగుతాడని గుర్తు చేశారు. ఇందులో భాగంగానే మధురాపూర్ అభివృద్ధికి నిధులు కేటాయించానని తెలిపారు. భవిష్యత్తులో కూడా నియోజకవర్గంలో రహదారులు, ఇతర అభివృద్ధి తన బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ తాను అడిగిన వెంటనే కాదనకుండా ప్రగతికి సహకరించిన సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులను అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తిస్థాయిలో కృషి చేస్తానని, షాద్ నగర్ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ మొహమ్మద్ అలీ ఖాన్ బాబర్, సీనియర్ నేత కాశీనాథ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసిలు శ్యాంసుందర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, తాండ్ర విశాల శ్రవణ్ రెడ్డి, భార్గవ్ కుమార్ రెడ్డి, అగ్గనూర్ విశ్వం, బస్వం, కొంకళ్ల చెన్నయ్య, మైనార్టీ నేతలు జమృత్ ఖాన్, ఇబ్రహీం, మదురా పూర్ నేతలు బాలరాజు గౌడ్, పుల్లారెడ్డి, అమర్నాథ్ రెడ్డి, హరీశ్వర్ రెడ్డి, శివారెడ్డి, మధుసూదన్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి, హరీశ్వర్ రెడ్డి, బుచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు