Mother harshness: కన్నతల్లి కర్కషత్వం
-- క్షణికావేశంలో దారుణానికి ఒడిగట్టిన వైనం -- కాల్వలో పడేయడంతో నలుగురు దుర్మరణం
కన్నతల్లి కర్కషత్వం
— క్షణికావేశంలో దారుణానికి ఒడిగట్టిన వైనం
— కాల్వలో పడేయడంతో నలుగురు దుర్మరణం
ప్రజా దీవెన / నాగర్ కర్నూలు: నవమాసాలు మోసి కన్న పిల్లలను తన చేతులతోనే కడతేర్చి కర్కషత్వాన్ని ప్రదర్శించింది ఓ కన్నతల్లి. సంసారంలో గొడవల కారణంగా ఓ కన్నతల్లి ఈ దారుణానికి ఒడిగట్టిన వైనంపై సమాజం యావత్తు చీధరిoచుకుంటుంది.
తన నలుగురు పిల్లలను కాలువలో తోసివేసి తానూ ఆత్మహత్యకు ప్రయత్నించిన ఈ దుర్ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని మంగనూరు గ్రామానికి చెందిన శరవంద, ఎర్రగుంట తండాకు చెందిన లలిత (33) ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.
వీరికి ఒక బాబు, ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. చాలా కాలంగా సంసారంలో గొడవలు జరుగుతున్న క్రమంలో తాజాగా కల్లు తెచ్చుకుంటానని భర్తను అడిగితే అతను వద్దని చెప్పడంతో లలిత తీవ్ర మనస్తాపానికి గురై భర్త బయటకు వెళ్లిన తర్వాత ఆగ్రహంతో పిల్లలతో సహా బయటకు వచ్చింది. తన భర్త వేధిస్తున్నాడని చెప్పి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టేందుకు పిల్లలతో కలిసి స్టేషన్‌కి వెళ్లింది.
స్టేషన్‌లో ఇద్దరు కానిస్టేబుళ్లు మాత్రమే ఉండటంతో ఆమెను కొద్ది సేపు అగాలని స్టేషన్‌లోనే కూర్చోబెట్టారు. దీంతో ఆ తర్వాత టిఫిన్ చేసి వస్తానని స్టేషన్‌లో చెప్పి లలిత బయటకు వచ్చేసింది.
ఈ క్రమంలో పోలీస్ స్టేషన్‌కు కొద్ది దూరంలో ఉన్న కేఎల్‌ఐ కాల్వ దగ్గరికి వెళ్లి తన నలుగురు పిల్లలను అందులో తోసివవేసింది. ఆ తర్వాత లలిత కూడా దూకాలని ప్రయత్నించగా స్థానికులు గమనించి అడ్డుకున్నారు.
ఆ తర్వాత వెంటనే అక్కడున్న వారు పిల్లలను కాపాడేందుకు కాల్వలోకి దూకగా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే మహాలక్ష్మి (5), సాత్విక (4), మంజుల (3) మృతి చెందారు. బాబు మార్కండేయ (7 నెలలు) గల్లంతవ్వగా ఆచూకీ ఇంకా లభించలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.