–పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాల్సిన బాధ్యత గ్రామపంచాయతీలదే
–ప్రతి పాఠశాలలో సోక్ పిట్లు నిర్మించాలి
–ఎక్కడ పారిశుద్ధ్య లోపం కారణంగా జబ్బులు రాకుండా చూడాలి
— జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి
District Collector Tripati :ప్రజాదీవెన నల్గొండ :అన్ని ప్రభుత్వ పథకాలలో పురోగతి తీసుకువచ్చేలా ఎంపీడీవోలు పనితీరును మెరుగుపరచుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఏపీవోలతో వివిధ అంశాలపై ఆమె సమీక్ష నిర్వహించారు. అన్ని రెసిడెన్షియల్ పాఠశాలల్లో అతిసారం, నీటి వల్ల సంక్రమించే వ్యాధులు పెరగకుండా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాల్సిన బాధ్యత పూర్తిగా గ్రామపంచాయతీలదేనని, దీనిని ఒక సవాల్ గా తీసుకొని ఎక్కడ పారిశుద్ధ్య లోపం కారణంగా జబ్బులు రాకుండా చూడాలని ఆదేశించారు. స్కూల్ టాయిలెట్లు, ఇతర పనులకు సంబంధించి అంచనాలను నిర్దేశించిన సమయంలో సమర్పించడమే కాకుండా, పారదర్శకంగా సమర్పించాలని, పనులలో పురోగతి ఉండాలని అన్నారు.
గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ద్వారా ఉపాధి హామీ పథకం కింద ప్రతి పాఠశాలలో సోక్ పిట్లు నిర్మించాలని, దీనిద్వారా విద్యార్థుల్లో నీటి సంరక్షణపై అవగాహన కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అలాగే ప్రతి పాఠశాల, అంగన్వాడి కేంద్రంలో న్యూట్రి గార్డెన్ లను చేపట్టాలని, ఇందుకుగాను మొక్కలు నాటాలని ఆదేశించారు. ఇంటింటికి మొక్కలు ఇచ్చే కార్యక్రమాన్ని మూడు, నాలుగు రోజుల్లో పూర్తి చేయాలని, స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా సోక్ పిట్ల నిర్మాణం చేపట్టాలని, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్లు ఇచ్చేందుకు అంచనాలు రూపొందించాలన్నారు.
వనమహోత్సవం లో భాగంగా గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా ఆగస్టు 15 నాటికి మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేయాలని, ఇందుకు గాను ఈ నెలాఖరులోపు గుంతలు తవ్వడాన్ని పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టే ఉద్యాన తోటల పెంపకంలో భాగంగా జిల్లాకు నిర్దేశించిన 3 వేల ఎకరాల లక్ష్యానికి గాను, ఇప్పటివరకు 1237 ఎకరాలు మాత్రమే గుర్తించడం జరిగిందని, సన్న, చిన్నకారు రైతులు తోటలు పెంచుకునేలా గుర్తించి తక్కిన లక్ష్యాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. ఈ సమావేశంలో ఉపాధి హామీ సోషల్ ఆడిట్, ఇందిరమ్మ ఇండ్ల పెండింగ్ పేమెంట్లు తదితరు అంశాలపై సమీక్షించారు.
స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జెడ్పి సిఈఓ శ్రీనివాసరావు, గృహ నిర్మాణ పిడి రాజకుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి తదితరులు హాజరయ్యారు.