ప్రజా దీవెన, నార్కట్ పల్లి:నార్కెట్పల్లి: నార్కెట్ పల్లి పట్టణ కేంద్రంలో గ్రామ పంచాయతీకి చెందిన గ్రామ కంఠం భూమి కూరగాయల అంగడి స్థలంలో హనుమాన్ యజ్ఞం నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ స్థానిక బస్టాండ్ ఆవరణలో నార్కెట్పల్లి పుర ప్రముఖులు, అయ్యప్ప స్వాములు, ఆంజనేయ స్వాములు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాస్తారోకో నిర్వహించారు. స్వాములు రోడ్డుపై మధ్యాహ్న భోజనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి సంఘీభావం ప్రకటిస్తూ స్వాములతో పాటు రాస్తారోకో లో పాల్గొన్నారు.
*ఈ సందర్భంగా నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ*
పాలకులు అధికారులు విఫలమయ్యారని దుయ్యబట్టారు. గ్రామ ప్రజలందరికీ చెందిన భూమిలో ఏ కార్యక్రమాలు నిర్వహించకుండా గత కొన్ని సంవత్సరాలుగా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని వర్షిత్ రెడ్డి ప్రశ్నించారు. జిల్లా కోర్టు గ్రామ కంఠం భూమిగా తీర్పు ఇచ్చినప్పటికీ కోర్టు ఉత్తర్వులను అమలు పరచకుండా ఒక వర్గానికి కొమ్ముకాస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం అధికారులు మానుకోవాలని హితవు పలికారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేపట్టి సంవత్సరాలుగా బిజినెస్ లు చేసుకుంటున్నా వారిని మందలించకుండా ఒక్కరోజు యజ్ఞం చేసుకుని వెళ్ళిపోతామంటే కేసులు పెడతామని బెదిరించడం ఎంతవరకు న్యాయమన్నారు.
గతంలో ఆర్డిఓ అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ సంవత్సర కాలంగా ఎందుకు కూల్చి వేయలేదని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేసి ప్రభుత్వ స్థలాన్ని ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. స్వాముల యజ్ఞం అనగానే చట్టాలు గుర్తు చేస్తున్న అధికారులు చట్టాన్ని అమలుపరిచి అక్రమార్కులకు ఎందుకు శిక్ష వేయడం లేదని ప్రశ్నించారు.
గ్రామ కంఠం భూమి కూరగాయల అంగడి స్థలంలో యజ్ఞం నిర్వహణకు నిరాకరించిన అధికారుల నిర్ణయానికి నిరసనగా నార్కెట్పల్లి పట్టణ ప్రజలు, దుకాణ యజమానులు స్వతహాగా బందు పాటించి స్వాములకు సంఘీభావం తెలిపారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు నార్కెట్పల్లి ప్రజల సహకారంతో నిరసన కార్యక్రమాలు ప్రతిరోజు కొనసాగించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు మంగళవారం కూడా స్థానికుల సహకారంతో నార్కెట్పల్లి బంద్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు, అయ్యప్ప స్వాములు, ఆంజనేయ స్వాములు తదితరులు పాల్గొన్నారు