— బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్:
ఎన్నికల సమయంలో అమలు సాధ్యం కాని హామీలు, ఆరు గ్యారంటీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను వంచించి ఏడాది పాలనను పూర్తి చేసుకుం దని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి విమర్శించారు.కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ ఏడాది పాలన ప్రజా వ్యతిరేక విధాలపైన బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నియోజకవర్గ వ్యాప్తంగా బైక్ ర్యాలీలు నిర్వహించారు.. ఈ సందర్భంగా వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు, 42O హామీలు అమలు చేస్తామని ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకుందని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించిందని ఆరోపించారు.
జిల్లాలో 2.75లక్షల మంది రైతులు ఉంటే.. కేవలం 70వేల మందికి మాత్రమే రుణ మాఫీ జరిగిందని, ఇంకా రెండు లక్షల మంది రైతులకు రుణమాఫీ కావాల్సి ఉందన్నారు. రైతులకు, కౌలు రైతులకు రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేసిందని ఆరోపించారు. ఏడాది గడిచినా ఆడబిడ్డలకు ప్రతినెలా రూ.2500 ఇస్తామని చెప్పి విస్మరించిందని విమర్శించారు. ఏడాదిలో రెండు లక్ష ల నియామకాలు చేపడుతామని చెప్పిందని గుర్తుచేశారు. కల్యాణలక్ష్మి, రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. కల్లబొల్లి మాటలతో కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తయ్యిందని, రాబోయే రోజుల్లో గ్యారంటీలు, హామీల అమలుకు బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడుతామని, ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటామని హెచ్చరించారు.
కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాధగోని శ్రీనివాస్ గౌడ్, బిజెపి కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు వీరెల్లి చంద్రశేఖర్, బండారు ప్రసాద్, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, లోకనబోయిన రమణ ముదిరాజ్, కంకణాల నాగిరెడ్డి, పగిడి మహేష్, తదితరులు పాల్గొన్నారు.