–అత్యున్నత స్థానం కోసం విద్యార్థులు కృషి చేయాలి
–కలెక్టర్ ఇలా త్రిపాఠి
Nalgonda Collector Tripathi : ప్రజాదీవెన నల్గొండ : సమాజంలో అత్యున్నత స్థానం సాధించడమే లక్ష్యంగా విద్యార్థులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయాదిత్య భవన్లో సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉంటూ పదవ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ఉద్దేశించి ఏర్పాటుచేసిన ప్రేరణ తరగతులకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు కష్టపడి చదవాలని, ఇందుకు ముందే ఒక లక్ష్యాన్ని ఎంపిక చేసుకోవాలని, ఆ లక్ష్యం సమాజంలో అత్యున్నత స్థానం అయి ఉండాలని, దాన్ని సాధించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందని విద్యార్థులను ప్రోత్సహించారు. పదవ తరగతి జీవితంలో అన్నింటికీ పునాది వంటిదని, అందువల్ల రానున్న పదవ తరగతి పరీక్షలను సవాల్ గా తీసుకొని రాయాలని చెప్పారు. ప్రతి గంట, ప్రతిక్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని, అనవసరంగా సమయాన్ని వృధా చేసుకోకుండా చదవాలన్నారు. పరీక్షల సమయంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని, అలాగే స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ రెండింటిని చేయాలని సూచించారు. పరీక్షలను బాగా రాసి 10 కి 10 జీపీఎ సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ ఇంచార్జ్ డిప్యూటీ డైరెక్టర్ కోటేశ్వరరావు, ట్రైనర్లు ఈ ప్రేరణ తరగతుల కార్యక్రమానికి హాజరయ్యారు.