–శిశు మరణాలు లేని జిల్లాగా నల్గొండను తీర్చిదిద్దాలి
–జాగ్రత్తలపై స్పష్టంగా తెలియజేసె బాధ్యత ఆశ, ఏఎన్ఎం ల పై ఉంది
–అనారోగ్యాన్ని గుర్తుపట్టే విధంగా అవగాహన కలిగించాలి
–డాక్టర్లు ప్రతినెల రెండుసార్లు సమావేశం ఏర్పాటు చేయాలి
–జిల్లా కలెక్టర్ త్రిపాఠి
Nalgonda District Collector Tripathi : ప్రజాదీవన నల్గొండ : శిశు మరణాలు లేని జిల్లాగా నల్గొండను తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ త్రిపాఠి ఆదేశించారు. గురువారం ఆమె ఉదయాదీత్య భవన్ లో మిర్యాలగూడ డివిజన్ పరిధిలో శిశు మరణాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ప్రసవానంతరం వివిధ కారణాలవల్ల శిశువులు చనిపోవడాన్ని తగ్గించాలని, ఇందుకు వైద్య ఆరోగ్యశాఖతోపాటు, మహిళా, శిశు సంక్షేమ శాఖల అధికారులు కృషి చేయాలని అన్నారు. అవగాహన లోపం, మూఢనమ్మకాలు, సకాలంలో వైద్యం అందకపోవడం తదితర కారణాలవల్ల శిశువులు చనిపోవడానికి వీలులేదని, సాధ్యమైనంతవరకు వారిని బ్రతికించేందుకు ఆశలు, ఏఎన్ఎం లతో సహా, డాక్టర్లు కృషి చేయాలని అన్నారు.
ముఖ్యంగా గ్రామస్థాయిలో మహిళ గర్భం దాల్చినప్పటి నుండి వారి ఆరోగ్యంతో పాటు, పుట్టబోయే శిశువు ఆరోగ్యం పట్ల, పుట్టిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తెలియజేయాలని, పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించడం, పాలు ఎలా పట్టించాలో, ఆ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టంగా తెలియజేసె బాధ్యత ఆశ, ఏఎన్ఎం ల పై ఉందని అన్నారు. అన్ని పీహెచ్సిలు, సబ్ సెంటర్లలో ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. శిశువు పుట్టిన తర్వాత 42 రోజుల వరకు గమనిస్తూ ఉండాలని, ఏమైనా సమస్యలు వస్తే తక్షణమే డాక్టర్ దగ్గరికి వెళ్లే విధంగా అవగాహన కల్పించాలని తెలిపారు. డాక్టర్లే కాకుండా శిశువు తల్లిదండ్రులు, ఇంట్లోని పెద్దలు శిశువును చూసిన వెంటనే వారికి ఉండే అనారోగ్యాన్ని గుర్తుపట్టే విధంగా వారిలో అవగాహన కల్పించాలని చెప్పారు. శిశువు ప్రాథమిక ఆరోగ్యం గురించి ఆలోచించాలని, బేబీని కాపాడే విషయంలో తల్లి, కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకోవాలని కోరారు.
డాక్టర్లు ప్రతినెల వారి పరిధిలో రెండుసార్లు ఆశ, ఏఎన్ఎం లతో సమావేశం ఏర్పాటు చేసి శిశు మరణాలు సంభవించకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిసిహెచ్ఎస్ మాత్రు నాయక్, డాక్టర్ వసుందర, డాక్టర్ స్వరూప, డిప్యుటీ డిఎంహెచ్ఓ లు, ప్రాజెక్ట్ అధికారులు, తదితరులు, ఈ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.