Nalgonda District Collector Tripathi : ప్రజాదీవెన నల్లగొండ : పంట మార్పిడి పై జిల్లా రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఇందుకుగాను అవసరమైతే వ్యవసాయ సీజన్ కు ముందే ఆయా డివిజన్ల వారిగా రైతు సదస్సులను నిర్వహించాలని చెప్పారు. జిల్లాలో రైతులు ఎక్కువ శాతం వరినే పండిస్తున్నందున వేసవిలో సాగునీరు సరిపోయినంత లేని సమయంలో, అలాగే భూగర్భ జలాలు తగ్గినప్పుడు పంటలకు ఇబ్బంది ఏర్పడుతుందని, అదే ఆరుతడి, ఉద్యాన పంటలు పండించినట్లయితే తక్కువ నీరు అవసరం అవుతుందని, వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని రైతులకు పంట మార్పిడి ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి పీర్యాదులను స్వీకరించారు.ఫిర్యాదుల స్వీకరణ అనంతరం ఆమె జిల్లా అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. జిల్లా అధికారులందరూ తప్పనిసరిగా ప్రజావాణికి హాజరుకావాలని, ఆయా శాఖలకు ఫిర్యాదులు వచ్చిన, రాకున్నా హాజరు తప్పనిసరి అన్నారు.అధికారులందరు ప్రజావాణి కి హాజరైనప్పుడే ప్రజలకు అధికారుల పట్ల నమ్మకం కలుగుతుందని, కిందిస్థాయి అధికారులను ప్రజావాణికి పంపించవద్దని ఆమె పునరుద్ఘాటించారు.
గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం పాఠశాల విద్యార్థులకు జూన్ 12న పాఠశాలల పునఃప్రారంభం తర్వాత యూనిఫామ్స్ ఇచ్చేందుకుగాను జిల్లా విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలు ముందే చర్యలు తీసుకోవాలని, డిఈఓ బిక్షపతిని, డిఆర్డిఓ శేఖర్ రెడ్డిని ఆదేశించారు. కాగా డిఆర్డిఓ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ 1180 పాఠశాలల్లో 70,253 మంది విద్యార్థులకు యూనిఫార్మ్స్ కుట్టేందుకు 1180 స్వయం సహాయక బృందాలను గుర్తించడం జరిగిందని, ఒక్కో సంఘానికి 70 చొప్పున డ్రెస్సులను ఇస్తున్నామని , మెటీరియల్ వచ్చిన వెంటనే మే 31 నాటికి వీటిని కుట్టడం పూర్తిచేసి అందజేస్తామని తెలిపారు. వచ్చే ఖరీఫ్ సీజన్లో పంట మార్పిడి కింద వరికి బదులుగా ఇతర పంటలకు వేసుకోవాలని రైతులకు చెప్పాల్సిన బాధ్యత వ్యవసాయ అధికారులతో పాటు, మండల ప్రత్యేక అధికారులపై ఉందని అన్నారు. ఇందుకుగాను ముందుగానే వచ్చే వ్యవసాయ సీజన్లో రైతులు ఎంత మేర వరి పండిస్తున్నారో వివరాలు సేకరించాలని, రైతులు పూర్తిగా వరి పంట వైపు వెళ్లకుండా ఇతర పంటలు పండించాలని తెలియజేయాలని, ఒకవేళ వరి వేయాల్సి వస్తే అన్న ధాన్యం పండించే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. దీంతో పాటు, జిల్లాలోని చాలా ప్రాంతాలలో ఉద్యాన పంటలకు మంచి అవకాశం ఉందని, అందువల్ల ఉద్యాన పంటల వైపు రైతులను మళ్లించాలని దీనివల్ల వేసవిలో సాగునీటి సమస్య రాదని, తద్వారా తాగునీటి సమస్య ఉండదని తెలిపారు.
బీహార్ రాష్ట్రంలో “మఖాన” పంటను అధిక మొత్తంలో పండిస్తున్నారని, ఈ పంట వల్ల లాభం ఎక్కువగా వస్తుందని, జిల్లా రైతులు ఈ పంటను సాగు చేసే విధంగా శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు ప్రోత్సహించాలని కోరారు. మఖానలో క్యాల్షియం ఎక్కువగా ఉంటుందని, దీనిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయని, ప్రపంచ మార్కెట్లో సైతం మఖానాకు విపరీతమైన ధరలు ఉన్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని పైలెట్ పద్ధతిన జిల్లాలో పండించేందుకు రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో మాట్లాడడం జరిగిందని, ముందుగా నల్గొండ, కట్టంగూరు, తిప్పర్తి, కొండమల్లేపల్లి, చందంపేట తదితర మండలాలలో మఖాన ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మఖాన సాగుపై జిల్లా నుండి శాస్త్రవేత్తలను, వ్యవసాయ అధికారులను బీహార్ కు అధ్యయనం నిమిత్తం పంపించడం జరిగిందని వెల్లడించారు.ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ మఖాన పంట సాగు పద్ధతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లాలో వ్యవసాయ, హర్టికల్చర్ విశ్వవిద్యాలయంలో సైతం మఖాన పట్ల ఆసక్తిగా ఉన్నారని, దీనిపై రైతులకు అవగాహన కల్పిస్తే ఇక్కడ ప్రజలకు మఖాన తో పోషకాలు పొందడంతో పాటు, రైతులకు ఎంతో లాభంగా ఉంటుందని, ఈ విషయంపై అధికారులు దృష్టి సారించాలని, ఎంపిక చేసిన మండలాలలో మండల వ్యవసాయ అధికారులు నోడల్ అధికారిగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ కోరారు.
ఇతర అవసరాలకు వాడితే జరిమానా..
మున్సిపాలిటీలు, గ్రామాలలో తాగునీటిఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా మిషన్ భగీరథ తాగునీటిని ఇతర అవసరాలకు వాడవద్దని, ఒకవేళ ఎవరైనా ఆ విధంగా వాడినట్లయితే జరిమానా విధిస్తామని హెచ్చరించాలని కలెక్టర్ తెలిపారు. అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, ప్రత్యేక కలెక్టర్ నటరాజ్, ఇన్చార్జి డిఆర్ఓ వై. అశోక్ రెడ్డి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి , జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.