— కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
— కన్న బిడ్డలు చూడటం లేదని కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన వృద్ధులు
Nalgonda District Collector Tripathi : ప్రజాదీవెన నల్లగొండ : వయోవృద్ధులు, దివ్యాంగుల కై ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లాలోని, వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో పెద్ద మొత్తంలో వయో వృద్దులు, దివ్యాంగులు ప్రజా వాణి కి రావడం, వారి సమస్యల పరిష్కారం కోసం క్యూ లైన్లలో నిలబడలేక పోవడం వంటి వారి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వయోవృద్ధులు, దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈ మేరకు వయోవృద్ధులు, దివ్యాంగుల శాఖ అధికారులను ప్రత్యేక ప్రజావాణి నిర్వహణ కై ఇదివరకే ఆదేశించడమే కాకుండా, ఈ ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమానికి వైద్య ఆరోగ్యశాఖ, గ్రామీణ అభివృద్ధి, ఇతర శాఖ అధికారులు సైతం హాజరై అక్కడికక్కడే వారి సమస్యలను పరిష్కరించాలని ప్రజావానికి పిలిపించడం జరిగింది. ఈ వారం నిర్వహించిన ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో సుమారు 49 మంది వయోవృద్ధులు, దివ్యాంగులు వచ్చేసి వారి ఫిర్యాదుల పరిష్కారానికి దరఖాస్తులను సమర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఒక్కొక్క ఫిర్యాదును పిర్యాదుదారు ఎదురుగానే క్షుణ్ణంగా పరిశీలించి ఆ పిర్యాదు పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరిగింది. సంబంధిత శాఖల అధికారులను తన వద్దకు పిలిపించుకొని అక్కడే ఫిర్యాదును పరిష్కరించాలని చెప్పారు. పై స్థాయిలో పరిష్కారం అయ్యే దరఖాస్తులపై దరఖాస్తుదారులకు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. మరికొన్ని పరిష్కారం కానీ వాటిని పరిష్కారం కావని, కోర్టు లేదా ఇతర వేదికల ద్వారా పరిష్కారం చేసుకోవాలని ఆమె సూచించారు. కాగా మొదటిసారి నిర్వహించిన వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులలో దివ్యాంగులకు పెన్షన్ మంజూరు, ఉద్యోగ, ఉపాధి కల్పన, సదరం సర్టిఫికెట్ల దరఖాస్తులు సమర్పించగా, వయోవృద్ధులు పోషణ కోసం దరఖాస్తులను సమర్పించారు.
కన్నా బిడ్డలు చూడటం లేదని…
తమ పిల్లలు తమను చూడటం లేదని, తమ బాగోగులను చూసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తులను సమర్పించారు. వయోవృద్ధులైన తల్లిదండ్రులను వారి పోషణ బాగోగులను చూడకుండా కొడుకులు, కూతుళ్లు పట్టించుకోని కేసుల విషయంలో జిల్లా కలెక్టర్ ఆ ఫిర్యాదులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ఆర్డీవోలకు
ఆదేశాలు జారీ చేశారు. వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకించి రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ప్రత్యేకంగా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల వయోవృద్ధుల సంఘం, అలాగే దివ్యాంగుల సంఘం జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఇన్చార్జి డిఆర్ఓ వై అశోక్ రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పుట్ల శ్రీనివాస్, డిఆర్డిఏ అధికారులు, తదితరులు ఈ ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యారు.