— జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Ila Tripathi : ప్రజాదీవెన, నల్గొండ: అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకుని దాన్యము కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం ఆమె నల్గొండ జిల్లా, నల్గొండ మండలం, నకిరేకల్ మండలాలలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా జిల్లా కలెక్టర్ నల్గొండ మండలం, చందనపల్లి లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ పరిస్థితులను పరిశీలించారు.
ఈ కేంద్రంలో అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నప్పటికీ లారీలను పెంచాల్సిన అవసరం ఉందని, అందువల్ల మరో రెండు వాహనాలను పెంచి త్వరితగతిన ధాన్యాన్ని మిల్లులకు పంపించాలని ఆదేశించారు. అదేవిధంగా నాణ్యత ప్రమాణాలతో తీసుకువచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, ఎక్కడా ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పారు. ఆర్జాల బావి ధాన్యం కొనుగోలు కేంద్రం తనిఖి సందర్భంగా ఎక్కువ ధాన్యం కుప్పలు గుర్తించిన జిల్లా కలెక్టర్ త్వరితగతిన ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు గాను మరో 5 వాహనాలను పెంచాలని, 10 రోజుల్లో దాన్యం కొనుగోలు మొత్తాన్ని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా అకాల వర్షాలు వస్తున్న దృష్ట్యా కొనుగోలులో ఇబ్బందులు ఏర్పడి రైతులు నష్టపోకుండా కొనుగోలును వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. వర్షానికి తడవకుండా అవసరమైన టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ నిర్వాహకులను ఆదేశించారు. రైతులు ఎట్టి పరిస్థితులలో నాణ్యత ప్రమాణాలతో కూడుకున్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని చెప్పారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దాన్యం తేమను పరిశీలించారు. అంతేకాక రైతులు తీసుకువచ్చిన పలు ధాన్యం కుప్పలను పరిశీలిస్తూ తాలు, చెత్తా,చెదారంలను పరిశీలించారు. రైతులు ఎలాంటి తాలు లేకుండా మట్టి పెల్లలు, చెత్త లేకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే విధంగా అవగాహన కల్పించాలని చెప్పారు. ఇన్చార్జి రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, జిల్లా సహకార అధికారి పత్యా నాయక్, తహసిల్దార్ హరిబాబు ,తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.