–కలెక్టర్ ఇలా త్రిపాఠి
–కేజీబీవిలకు 20వేలు మంజూరు
–నచ్చిన పనులు కాకుండా, అవసరమైన వాటిని ప్రతిపాదించాలని సూచన
–మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు కేజీబీవీలను సందర్శించాలని ఆదేశం
Collector Tripathi : ప్రజాదీవెన నల్గొండ : ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం పై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని తాను మార్క్ చేసిన ఫిర్యాదులను తిరిగి కింది స్థాయికి మార్క్ చేయకుండా ప్రత్యక్షంగా వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం వివిధ అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు.
జిల్లా స్థాయిలో వచ్చిన ఫిర్యాదులు జిల్లా అధికారులతో పాటు, మండల స్థాయి అధికారులకు మార్క్ చేయడం జరుగుతున్నదని అయితే అలా వచ్చిన వాటిని అధికారులు వారి స్థాయిలోనే పరిష్కరించే చర్యలు తీసుకోవాలని, అలా కాకుండా తిరిగి కింది స్థాయికి పంపించవద్దని, ఒకవేళ సమస్యను పరిష్కరించడంలో ఏమైనా ఇబ్బంది ఉంటే పిర్యాదుదారుకు స్పష్టంగా తెలియజేయాలని చెప్పారు. రేషన్ కార్డుల దరఖాస్తులను పౌరసరఫరాల అధికారులు క్షుణ్ణంగా పర్యవేక్షించాలని, రేషన్ కార్డుకు చేసుకున్న దరఖాస్తు తిరస్కరణకు గురైతే స్పష్టంగా తెలియజేయాలని అన్నారు. మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు వారి పరిధిలోని కేజీబీవీలను సందర్శించాలని, కేజీబీవీ లలో తక్షణ పనుల నిమిత్తం 20 వేల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, అయితే సంబంధిత కేజీబీవిల ప్రత్యేక అధికారులు వారికి నచ్చిన పనులు కాకుండా, అవసరమైన వాటిని ప్రతిపాదించాలని సూచించారు. చాలా కేజీబీవీలలో కోతుల బెడద కారణంగా ఫెన్సింగ్ అవసరం ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని, సిమెంట్ ఫెన్సింగ్ కు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉన్నందున, ఇతర ఫెన్సింగ్ ప్రతిపాదించాలని చెప్పారు. కాగా ఈ సోమవారం మొత్తం 70 ఫిర్యాదులు రాగా, రెవిన్యూ శాఖకు 47,జిల్లా అధికారులకు 23 వచ్చాయి.
అదనపు కలెక్టర్లు జె. శ్రీనివాస్, నారాయణ అమిత్, స్పెషల్ కలెక్టర్ సీతారామారావు, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, గృహ నిర్మాణ పీడీ రాజకుమార్, ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.