–మూడు రెట్ల అధిక దిగుబడి
— ఆదాయాన్ని అందించే సులభతర బహువార్షిక వాణిజ్య పంట
–భూమి, నీటి వనరులు వున్నా ప్రతీ రైతు ఉద్యాన పంటల వైపు రావాలి
–జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి అనంత రెడ్డి
Industries Department Officer Ananth Reddy : ప్రజాదీవెన నల్గొండ : వరి పంటకు ప్రత్యామ్నాయంగా, మూడు రెట్లు అధిక దిగుబడి, ఆదాయాన్ని అందించే సులభతరమైన బహువార్షిక వాణిజ్య పంట ఆయిల్ పామ్ ను సాగు చేయాలని
జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి అనంత రెడ్డి సూచించారు. ఆయిల్ పామ్ మొక్కను ఒకసారి నాటితే 4 వ సంవత్సరం నుండి నిర్విరామంగా 30 సంవత్సరాల వరకు సరాసరిన ఎకరానికి 10 నుండి 12 టన్నుల దిగుబడి తీసుకోవచ్చని ఎకరానికి లక్ష ఇరవై వేల నుండి లక్ష యాభై వేల వరకు నికర లాభం పొందవచ్చు అన్నారు. సోమవారం
ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో, ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ లో భాగంగా
చెరుగట్టు గ్రామం, నార్కెట్పల్లి మండలనికి చెందిన బిల్లాల సత్తిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో 17.5 ఎకరాలలో పతంజలి ఫుడ్స్ ఆయిల్ పామ్ కంపెనీ భాగస్వామ్యంతో ఆయిల్ పామ్ మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ప్రారంభించారు. మొదటి మొక్కని నాటి 17.5 ఎకరాల క్షేత్రంలో ఎకరానికి 57 మొక్కల చొప్పున మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.ఈ పంట నుండి ప్రతి నెల ఆదాయాన్ని పొందవచ్చు అని తెలిపారు. పంటకు జంతువుల నుండి గానీ, దొంగల నుండి గానీ ఎటువంటి బెడద ఉండదని పేర్కొన్నారు. మిగతా పంటలతో పోల్చినపుడు ప్రకృతి వైపరీత్యాలను, చీడ పీడలను తట్టుకునే శక్తి చాలా ఎక్కువ. మరే పంటలో సాధ్యం కాని బహుళ పంటలు (మల్టీ స్టోరీడ్) పండించి బహుళ ప్రయోజనాలు పొందగలిగే అవకాశం ఉన్న ఏకైక పంట అన్నారు. ఆయిల్ పామ్ మూడవ సంవత్సరం వయసు నుండి ఇందులో అంతర పంటగా కోకో, వక్క, మిరియాలు, తమలపాకు, హెలికానియూమ్స్, రెడ్ జింజర్ వంటి అదనపు ఆధాయాన్నిచ్చే పంటలు కాకుండా సూపర్ నేపియర్ గడ్డి పెంచుకొని పాడి పంటల ద్వారా గేదెలను, ఆవులను, గొర్రెలను, మేకలను పెంచి మాంసం, పాల అమ్మకం ద్వారా కూడా రైతు అదనపు ఆదాయాన్ని పొందగలిగే వెసులుబాటు ఉందని వివరించారు. ఈ పంట సాగుకు 100 శాతం రాయితీతో మొక్కలు సరఫరా చేస్తూ, మొక్కకు నీరు అందించే డ్రిప్ పరికరాలకు కూడా రాయితీ అందిస్తుంది. మొదటి నాలుగు సంవత్సరాలకి మొక్కల యాజమాన్యానికి ఎకరానికి 4200 చొప్పున ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రైతు ఖాతాలో జమ చేయబడుతుంది. భూమి, నీటి వనరులు ఉన్న ప్రతీ రైతు సాంప్రదాయ వ్యవసాయ పంటల నుండి ఆయిల్ పామ్, ఉద్యాన పంటల వైపు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నార్కెట్పల్లి ఉద్యానశాఖ అధికారి శ్వేత, పతంజలి ఫుడ్స్ జిల్లా జనరల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, ఆయిల్ పామ్ కంపెనీ ప్రతినిధులు వినయ్, శ్రీనివాస్, వంశీ, డ్రిప్ కంపెనీ ప్రతినిధులు శేఖర్, శ్రీనివాస్ రెడ్డి, గ్రామ రైతులు వెంకట్ రెడ్డి, సతి రెడ్డి, నర్సి రెడ్డి, రాములు, విజయ్ పాల్గొన్నారు.