–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Collector Ila Tripati :ప్రజాదీవెన నల్గొండ : జనగామ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి నల్గొండ జిల్లా నుండి లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుకను ఇచ్చేందుకు జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం తీర్మానించింది. బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో నిర్వహించిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం రాష్ట్ర గృహ నిర్మాణ, రెవిన్యూ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఇందిరమ్మ ఇండ్లపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఇసుకలేని జిల్లాలకు ఇసుక రీచ్ లు ఉన్న జిల్లాల నుండి ఇసుకను సరఫరా చేయాలని జారీ చేసిన ఆదేశాల మేరకు
ఈ నిర్ణయం తీసుకుని జనగామ జిల్లాకు లక్ష క్యూబిక్ మీటర్ల ఇసుకను ఇచ్చేందుకు కమిటీ తీర్మానించింది. అలాగే శాలిగౌరారం మండలం వంగమర్తి, చిత్తలూరు ఇసుక రీచ్ లలో కొత్తగా గుర్తించిన ప్రదేశం నుండి 27 హెక్టార్లలో ఇసుక తీసేందుకు రాష్ట్ర టిజీఎండిసికి ప్రతిపాదనలు పంపించేందుకు సమావేశం తీర్మానించింది. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా గనుల శాఖ సహాయ సంచాలకులు శామ్యూల్ జాకబ్, భూగర్భ జల వనరుల శాఖ ఉప సంచాలకులు, ఆర్డబ్ల్యూఎస్, ఇతర సంబంధిత శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.