ప్రభుత్వ ఆసుపత్రి లో రోగి హత్య
— మంచిర్యాల లో సంఘటన
ప్రజా దీవెన/మంచిర్యాల: ప్రాణాలు కాపాడుకునే ప్రభుత్వ ఆసుపత్రిలోనే ప్రాణాలు వదిలాడు ఓ రోగి. మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన ఓ రోగి హత్యకు సంబంధిన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. ఆసుపత్రిలో సామాన్లు భద్రపర్చుకునే బీరువా విషయంలో చోటుచేసుకున్న ఘర్షణ కారణంగా తన పక్క బెడ్‌పై నిద్రిస్తున్న రోగిని మరో రోగి కత్తితో పొడిచి చంపేసిన విషయం విస్తుగొలిపింది.
మంచిర్యాల జిల్లా ఇటిక్యాలకు చెందిన చిలుక దేవయ్య (50) హైబీపీ, కిడ్నీ సంబంధిత సమస్యతో మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం చేరారు. మహారాష్ట్రకు చెందిన సుధాకర్ అనే వలస కూలీ ఫిట్స్ సమస్యతో బాధపడుతూ మంగళవారం ఆస్పత్రిలో చేరాడు. దేవయ్య, సుధాకర్ పక్కపక్క బెడ్లపై ఉండి చికిత్స పొందుతున్నారు.
సామాన్లు భద్రపరుచుకునే అల్మారా విషయంలో వారిద్దరి మధ్య మంగళవారం రాత్రి గొడవ జరిగిందని సమాచారం. ఆ తర్వాత అందరూ నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయంలో సుధాకర్ పండ్లు కొసే కత్తితో దేవయ్య ఛాతీపై పొడిచాడు. దీనిని గమనించిన దేవయ్య భార్య కేకలు వేయగా సుధాకర్ పారిపోయాడు.
కత్తిపోటుకు గురైన దేవయ్యకు ఆస్పత్రి సిబ్బంది వెంటనే ప్రథమ చికిత్స చేశారు. ఆపై, మెరుగైన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న దేవయ్య బుధవారం మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.