Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CPM : డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు పట్టాలు వెంటనే ఇవ్వాలి

–సిపిఎం

CPM : ప్రజాదీవెన నల్గొండ :  నల్గొండ పట్టణంలోని 552 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గర మౌలిక సదుపాయాలు, పనులు త్వరితగతిన పూర్తి చేసి లాటరీ ద్వారా ఎంపికైన వారికి ఇంటి పట్టాలు ఇచ్చి స్వాధీన పరచాలని సిపిఎం జిల్లా కమిటి సభ్యులు యండి సలీం, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. బుధవారం సిపిఎం, డబల్ బెడ్ రూమ్ ఇండ్ల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆర్డీవో అశోక్ రెడ్డి ని కలిసి లాటరీ ద్వారా ఎంపికైన డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు ప్రోసిడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2017 లో అప్పటి ప్రభుత్వం నల్గొండ పట్టణం ఇల్లు లేని పేదల కోసం 552 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం ప్రారంభించింది. 2023 జూలైలో నల్గొండ పట్టణంలో ఇల్లు లేని పేదలందరూ దరఖాస్తు చేయగా విచారణ చేసి అర్హులను ఎంపిక చేసిందని తెలిపారు.

 

వార్డుల వారీగా అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో వీడియో రికార్డ్ చేస్తూ అర్హులందరినీ లాటరీ పద్ధతిలో 552 లబ్ధిదారులను గుర్తించింది. కానీ వారికి ఇప్పటివరకు స్వాధీనపరచలేదని ఆరోపించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ మౌలిక సదుపాయాలు లేకపోవడంతో లబ్ధిదారుల తరఫున సిపిఎం అనేక ఆందోళనలు చేసిన ఫలితంగా ప్రభుత్వం రెండు కోట్లు కేటాయించి అంతర్గత రోడ్లు, విద్యుత్తు, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యాల కల్పన కోసం పనులు ప్రారంభించిందని అవి నత్తనడకన నడుస్తున్నాయని ఆరోపించారు. త్వరితగతిన మౌలిక సదుపాయాల పనులు పూర్తిచేసి ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చి స్వాధీన పరచాలని డిమాండ్ చేశారు. 2017లో నిర్మాణం అయినందున శిథిలావస్థకు చేరుతున్నవి అర్హత కలిగి ఇండ్లు లేక పేదలు అవస్థలు పడుతున్నారు. రోజువారి పనులు చేసుకునే నిరుపేదలు అయిన వీరు ఇంటి అద్దెలు కట్టలేక కుటుంబాలు గడుపుకోలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పోరాట సాధన కమిటీ కన్వీనర్ మాజీ కౌన్సిలర్ అవుట రవీందర్ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల దగ్గర జరుగుతున్న పనులు త్వరితగతిన పూర్తి చేసి ఆగస్టు 15 నాటికి ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అందుకోసం ఆగస్టు 5న కలెక్టరేట్ ముందు లబ్ధిదారుల కుటుంబాల అందరితో కలిసి కలెక్టరేట్ ముందు ధర్నా చేయాలని నిర్ణయించడం జరిగిందని తెలిపారు. అధికారులు వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చి స్వాధీనపరచడానికి తగు చర్యలు తీసుకోవాలని లేనియెడల జరిగే పోరాటానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల పోరాట సాధనా కమిటీ కో కన్వీనర్ గంజి నాగరాజు, కమిటీ సభ్యులు ప్రశాంతి, రాజేష్, గౌసియా, సిరాజుద్దీన్, విజయలక్ష్మి, జయమ్మ, వెంకటమ్మ, లక్ష్మి వెంకటేశం గిరిజ, లాజర్, పార్వతి, జాన్సన్ చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.