Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Phule and Ambedkar ideologies : పూలే, అంబేద్కర్ ఆలోచన విధానాలే “బలహీన వర్గాలకు బలమైన ఆయుధం”

— ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాసిం

–పోరాటాల ద్వారానే సమూలమైన మార్పులు సాధ్యమని వ్యాఖ్య

–ఘనంగా పూలే అంబేడ్కర్ జాతర

–హాజరైన పలువురు వక్తలు

Phule and Ambedkar ideologies : ప్రజాదీవెన, నల్గొండ: బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మ జ్యోతిరావు పూలే ఆలోచనలే ఈ దేశంలోని బలహీన వర్గాలకు బలమైన ఆయుధాలని వాటి ద్వారానే సమసమానత్వం సాధ్యమని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాశీం అన్నారు.కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని గడియారం చౌరస్తాలో పూలే అంబేడ్కర్ జన జాతర బహిరంగ సభ సోమవారం జరిగింది. ముందుగా పులే, అంబేడ్కర్ మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి సభ ప్రారంభించారు.ఈ సభకు స్వాగతోపన్యాసం కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున చేయగా, జిల్లా అధ్యక్షులు కొండేటి శ్రీను అధ్యక్షత వహించారు.ఈ బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రొఫెసర్ కాశీం మాట్లాడుతూ ఈ దేశంలో ఒక కులం ఏర్పడి ఉన్నదని, బ్రాహ్మణీయ అధిపత్య వర్గాలు అంతరాలు సృష్టిస్తూ లబ్ధి పొందుతున్నారని 200 సంవత్సరాల క్రితం పుట్టిన మహాత్మ జ్యోతిరావు పూలే అర్థం చేసుకున్నారని అన్నారు. దేశంలో ఉన్న కుల వ్యవస్థను అర్థం చేసుకోలేనంత కాలం మనం మనుగడ సాధించలేమన్నారు. అంబేద్కర్, ఫూలే అనే మహనీయులు ఈ దేశ చరిత్రలో నిలిచిపోయారంటే వారు అభ్యసించిన విద్య మాత్రమేనని దాని ద్వారానే సమూలమైన మార్పులు సృష్టించబడతాయని నిరూపించారని పేర్కొన్నారు.విద్య లేకపోతే వివేకం లేదు. వివేకం లేకపోతే చైతన్యం లేదు. ఇవన్ని లేకపోవడంతోనే ఈ దేశంలో దళిత, బహుజన వర్గాల పరిస్థితి దీనంగా ఉందని, విద్యను చైతన్యాన్ని పెంపొందించడం ద్వారా ఆ వైపు గా పోరాటం చేసినప్పుడే ఈ దేశంలో బలహీన వర్గాలకు హక్కులు దక్కుతాయని అన్నారు. ఆ వైపుగా మహాత్మ జ్యోతిరావు పూలే తన సహచరి సావిత్రిబాయి పూలేకు విద్యను నేర్పించి వారు పొందిన జ్ఞానాన్ని సమాజానికి అందించాలనే ఉద్దేశంతో అనేక అవమానాలు, అనేక ఆటంకాలను ఎదుర్కొని అదరక, బెదరక ముందుకు సాగారని అన్నారు.

ఈ దేశంలో దళిత, బహుజన వర్గాలు పనిచేసుకుంటునే పనితో పాటు విద్యను నేర్చుకొవాలని అంబేడ్కర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.విద్యను క్రింది వర్గాలకు అందకుండా నేడున్న ప్రభుత్వాలు అంతరాలు సృష్టిస్తున్నాయని, నేడు దేశంలో దళిత, బహుజన వర్గాలు ఉన్నత విద్యను చదువుతున్న శాతం కేవలం 8శాతం మాత్రమేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం మూస దోరణిలో ఉందని, మొత్తంగా మను ధర్మ శాస్త్రాన్ని మనువాదాన్ని పాఠ్యాంశాలుగా చేర్చడానికి కుటిల ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. మొత్తంగా చైతన్యవంతమైన సమాజాన్ని తిరోగమనం వైపు తీసుకపోయే ప్రయత్నం చేస్తుందన్నారు. విద్య, వివేకం ఇవ్వాలని, విద్య చైతన్యం ఇవ్వాలని పూల అంబేడ్కర్ కోరుకున్నారు. ఇప్పుడున్న పాలకులు మాత్రం మూఢనమ్మకాలను ఆ శాస్త్రీయమైన అంశాలను చొప్పించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.పూలే, అంబెడ్కర్, భగత్ సింగ్ జీవిత చరిత్రను చివరికి పూలే సినిమాను కూడా భరించడానికి పాలకులు సిద్ధంగా లేరన్నారు. దోపిడీకి, పీడనలకు వ్యతిరేకమైన అనేక అంశాలను తొలగించుకుంటూ ఈ పాలకులు వస్తున్నారన్నారు. కాశ్మీర్ ఫైల్స్, రజాకార్ ఫైల్స్ వంటి సినిమాలు తీసి చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే సినిమా వస్తే సెన్సార్ చేసి విడుదల చేయమంటున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని ప్రశ్నించారు. వివక్షతులు రూపుమాపాలన్న సమానత్వం నెలకొల్పబడాలన్న పోరాటం తప్ప మరొక మార్గం లేదని స్పష్టం చేశారు.

–పూలే అంబేడ్కర్ భావజాలమే బడుగులకు మార్గం…

మతోన్మాద శక్తులు ఈ దేశంలో మనువాదాన్ని అడ్డం పెట్టుకొని పేట్రేగి పోతున్నాయని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు అన్నారు. ఈ దేశంలో బిజెపి పార్టీ వివక్షతలను పెంచి పోషిస్తుందని పేర్కొన్నారు. జ్యోతిరావు పూలే పురుషుల తోపాటు మహిళలను సమానంగా చూడాలని సమసమానత్వాన్ని నెలకొల్పాలని ఆకాంక్షిస్తే, బిజెపి ప్రజాప్రతినిధులే ఈ దేశంలోని మహిళలపై అత్యాచారాలకు పాల్పడేవారిలో ముందంజలో ఉన్నారన్నారు. పూలే అంబేడ్కర్ ఆలోచనలను కనుమరుగు చేయడానికి బిజెపి పార్టీ ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం, సమానమైన హక్కుల పై మాట్లాడడం బిజెపికి గిట్టడం లేదన్నారు.మనువాదాన్ని అణువణువున బిజెపి పార్టీ అమలు చేస్తుందని మండిపడ్డారు. అప్రమత్తంగా ఉంటూ ఉద్యమాలను నిర్మిస్తూ పూలే అంబేడ్కర్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.పూలే అంబేడ్కర్ అడుగుజాడల్లో కెవిపిఎస్ కొనసాగుతుందని అన్నారు. కార్యక్రమానికి ముందు ఏపూరి సోమన్న మహనీయుల ఆలోచన విధానాలను ఆటపాట మాట రూపంలో వ్యక్తీకరించారు. ఈ దేశంలో జ్ఞానం అందుకొని మన బలాన్ని పెంచుకొని ప్రజల్లో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు అంబటి నాగయ్య, మహాత్మా గాంధీ యూనివర్సిటీ అధ్యాపకురాలు అనిత హాజరై ప్రసంగించారు.