Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Prisoners release: వారందరూ జనజీవన స్రవంతిలోకి

–రాష్ట్ర ప్రభుత్వ క్షమాభిక్ష పొందిన 213 మంది ఖైదీల విడుదల
–చర్లపల్లి జైలు నుంచి అందరూ ఒకేసారి బయటకు విడుదల
–అందులో 70 మందికి పెట్రోల్‌ బంకుల్లో కొలువు

Prisoners release: ప్రజా దీవెన, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించిన 213 మంది ఖైదీలు జైలు (Prisoners release) నుంచి బుధవారం విడుదలయ్యారు. క్షమాభిక పొందిన ఖైదీలు రాష్ట్రం లోని వివిధ జైళ్లలో ఉండడంతో అందరినీ చర్లపల్లి కారాగారానికి చేర్చిన అధికారులు ఒకేసారి విడుదల చేశారు. ఇలా జరగడం జైళ్ల శాఖ చరిత్రలో ఇదే తొలిసారి. క్షమాభిక్ష పొందిన వారిలో 35 మంది మహిళలు, 205 మంది జీవిత ఖైదీలు, ఎనిమిది మంది దీర్ఘకాల శిక్ష అనుభవిస్తున్న వారు ఉన్నారు. ఇందులో చర్లపల్లి(cherlapalli) కేంద్ర కారాగారం నుంచి 61 మంది, ఓపెన్‌ ఎయిర్‌ జైలు నుంచి 31, చంచల్‌గూడ సెంట్రల్‌ జైలు నుంచి 27, మహిళా జైలు నుంచి 35, వరంగల్‌ సెంట్రల్‌ జైలు నుంచి 20, నిజామాబాద్‌ సెంట్రల్‌ జైలు నుంచి 15 మంది విడుదలయ్యారు. అలాగే, సంగారెడ్డి సెంట్రల్‌ జైలు (sangareddy Central Jail)నుంచి ఒకరు, మహబూబ్‌నగర్‌ జిల్లా జైలు నుంచి ఇద్దరు, ఆదిలాబాద్‌ జైలు నుంచి ముగ్గురు, కరీంనగర్‌ జిల్లా జైలు నుంచి ఏడుగురు, ఖమ్మం జిల్లా జైలు నుంచి నలుగురు, ఆసిఫాబాద్‌ స్పెషల్‌ సబ్‌ జైలు నుంచి ముగ్గురు, నల్లగొండ డిస్ట్రిక్ట్‌ జైలు నుంచి నలుగురు విడుదలయ్యారు. ఈ సందర్భంగా చర్లపల్లి కేంద్ర కారాగారం (cherlapalli Central Jail) ఆవరణలో బుధవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర జైళ ్లశాఖ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ పి.సౌమ్య మిశ్రా విడుదలవుతున్న ఖైదీలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సమాజంలో సత్ప్రవర్తనతో మెలగాలని, ప్రశాంత జీవితం గడపాలని వారికి హితవు పలికారు.

కాగా, క్షమాభిక్షపై విడుదలైన వారిలో ముగ్గురు మహిళలు సహా 70 మందికి జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెట్రోల్‌ బంకుల్లో(petrol bunk) ఉద్యోగం ఇచ్చారు. మరో ఎనిమిది మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. మిగిలిన వారికి కూడా త్వరలోనే ఉపాధి కల్పిస్తామని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జైళ్లశాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌లు వై.రాజేష్‌, ఎన్‌.మురళీబాబు, డీఐజీలు డాక్టర్‌ డి.శ్రీనివాస్‌, ఎం.సంపత్‌ , చర్లపల్లి సూపరింటెండెంట్‌ సంతోష్‌ కుమార్‌ రాయ్‌, చంచల్‌గూడ సూపరింటెండెంట్‌ నవాబ్‌ శివకుమార్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.