Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

General Strike : నేటి సార్వత్రిక సమ్మెకు ప్రజా సంఘాల మద్దతు

–పట్టణంలో పలుచోట్ల నిరసనలు

General Strike : ప్రజాదీవెన నల్గొండ : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా జులై 9న జరుగు సార్వత్రిక సమ్మెకు ప్రజాసంఘాల పోరాట కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలో కతాల గూడెం, భాస్కర్ టాకీస్ అడ్డా, వలస కార్మికుల అడ్డా, రామగిరి, ప్రభుత్వ హాస్పిటల్ చౌరస్తా, మహిళా ప్రాంగణం, శివాజీ నగర్, మర్రిగూడెం, పద్మ నగర్, పెద్ద బండ తదితర ప్రాంతాలలో ప్లే కార్డులతో సమ్మెకు సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా సిఐటియు, ఐద్వా, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, డివైఎఫ్ఐ, కెవిపిఎస్, ఆవాజ్ సంఘాల నాయకులు ఎండి సలీం, దండంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, కుంభం కృష్ణారెడ్డి, దండంపల్లి సరోజ, గాదె నరసింహ, గుండాల నరేష్, ఎస్.కె మహబూబ్ అలీ లు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేస్తూ తెచ్చిన నాలుగు లేబర్ కోడులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

రైతాంగానికి కనీసం మద్దతు ధర చట్టం చేయాలని, ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచి పట్టణ ప్రాంతాలకు విస్తరింప చేయాలని, సంవత్సరానికి 200 రోజుల పని దినాలు, రోజు కూలి 600 రూపాయలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ప్రజల కష్టార్జితంతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు కార్పోరేట్ సంస్థలకు అప్ప చెప్పవద్దని డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో, నిత్యవసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. కేంద్రం, రాష్ట్రం తోడుదొంగల్లాగా కార్మికుల పని గంటలు పెంచి దోపిడిని కొనసాగించాలని చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర ,రాష్ట్ర ఉద్యోగ కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్లు ఇచ్చిన జూలై 9 సార్వత్రిక సమ్మె ,గ్రామీణ బంద్ కు ప్రజా సంఘాల పోరాట వేదిక సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని అన్నారు. పలుచోట్ల జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు టౌన్ కన్వీనర్ అవుట రవీందర్, రైతు సంఘం పట్టణ అధ్యక్షులు పిన్నపురెడ్డి మధుసూదన్ రెడ్డి, పట్టణ కార్యదర్శి భూతం అరుణ, తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక నాయకులు అద్దంకి నరసింహ, పాక లింగయ్య, ఊటుకూరు మధుసూదన్ రెడ్డి, గంజి నాగరాజు, కుంభం లక్ష్మమ్మ, సర్దార్ అలీ, పనస చంద్రయ్య, పల్లె నగేష్, కత్తుల యాదయ్య, కడారి నరసింహ, రాజు, భద్రయ్య, శ్రీవాణి, సాగర్ల మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.