డ్రైనేజీలో బిందెలు ఉంచి నీళ్లు పట్టుకోవాల్సిన పరిస్థితి
Vempati SC Colony : ప్రజా దీవెన… తుంగతుర్తి… : మండల పరిధిలోని వెంపటి గ్రామంలో ఎస్సీ కొత్త కాలనీకి మంచినీటి సౌకర్యం లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ ఇంటింటికి నల్లాలు అనే కార్యక్రమంలో ఎస్సీ కాలనీలో నల్లాలు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అక్కడక్కడ ఉన్న నల్లాల వద్ద నీళ్లు పట్టుకోవడం ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. డ్రైనేజీ కాల్వల్లో మురుగునీరు ప్రవహిస్తుండగా అదే కాలువలో బిందెలు పెట్టి నీళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది.
పుష్కలంగా వర్షాలు కురిసి కావలసినన్ని నీళ్లు ఉండగా ఎస్సీ కాలనీ వారికి మాత్రం మంచినీటి ఇబ్బంది ఇంకా కొనసాగడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు . తమ ఇళ్లకు నల్లాలు ఇవ్వాలని ఎస్సీ కాలనీవాసులు అటు అధికారులను ఇటు ప్రజాప్రతినిధులను కోరుతున్నారు. వర్షాకాలంలో మంచినీళ్లకు ఇబ్బంది పడుతున్న కాలనీవాసుల దుస్థితి గమనించి అధికారులు తక్షణమే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.