Retired teachers : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఇటీవల రిటైర్డ్ అయిన, ఉపాధ్యాయ అధ్యాపకులకు ప్రభుత్వం నుండి వచ్చే బెనిఫిట్స్, సంవత్సరకాలం గడుస్తున్న రాలేదని రిటైర్డ్ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని,పీఆర్టీయూ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సిలిగిరి రామకృష్ణారెడ్డి,ప్రధాన కార్యదర్శి కట్టబత్తుల గణేష్ మాట్లాడుతూ,గత 35 సంవత్సరాలుగా ప్రభుత్వంలో సేవలు అందిస్తూ, పాఠశాలల అభివృద్ధికి, విద్య వ్యవస్థ అభివృద్ధికి ఎంతో కృషి చేశామని అన్నారు.
రిటైర్డ్ అయిన ప్రతి ఉపాధ్యాయ అధ్యాపకులకు రిటైర్డ్ తర్వాత వచ్చే బెనిఫిట్స్ రాకపోవడంతో ఎంతో ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఆడపిల్లల పెళ్లిళ్లు చేయడానికి ఆసరాగా ఉంటుందనుకున్న బెనిఫిట్స్ రాకపోవడంతో నిరాశ ఎదుర్కొంటున్నామని అన్నారు. ఎంతోమంది ఉపాధ్యాయులు ఆర్థిక లావాదేవీలతో సతమతమవుతూ ఆత్మహత్యలకు దారితీస్తుందని అన్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి, సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకుపోవడం జరిగిందని తెలిపారు.
తమకు రావలసిన బెనిఫిట్స్ తక్షణమే వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు,అధ్యాపకులు, కే వెంకటరెడ్డి,మహమ్మద్ ముస్తఫా, అలీ ఖాన్, ఇంద్రసేనారెడ్డి,బి ప్రతాపరెడ్డి,వందనం వెంకటరెడ్డి తదితరులు ఉన్నారు.