–మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Revanth Reddy :
ప్రజా దీవెన, నల్లగొండ:
నల్లగొండ జిల్లాలో కరువును శాశ్వతంగా పారద్రోలేందుకు, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం కు 6,190 కోట్ల రూపాయల కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండ జిల్లా ప్రజల పక్షాన ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీశైలం ఫోర్ షోర్ నుంచి ఎదుల రిజర్వాయర్ ద్వారా డిండి, సింగరాజుపల్లి, ఎర్రవల్లి-గోకారం, గొట్టెముక్కుల, ఇర్విన్, చింతపల్లి, కిష్టరాంపల్లి, శివన్నగూడెం రిజర్వాయర్లను నింపి వచ్చే మూడేండ్లలో నల్లగొండ జిల్లాలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అంది స్తామని ఆయన ప్రకటించారు.
ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తిచేసి దశబ్ధాల సాగునీటి కరువును తరమేయడంతో పాటు, ఫ్లోరైడ్ తో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న నల్లగొండ జిల్లా ప్రజల త్రాగునీటి కష్టాలను తీర్చుతామని, నల్లగొండ జిల్లా నుంచి ఫ్లోరైడ్ ను శాశ్వతంగా తరమేస్తామని ఆయన చెప్పారు.
ఇవ్వాల అధికారం పోయిందనే బాధలో కుటిల రాజకీయాల కోసం నల్లగొండ జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్న ప్రతిపక్షాలు.. పదేండ్లుగా నల్లగొండ జిల్లా ప్రాజెక్టులను ఎందుకు పడావు పెట్టారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు నల్లగొండ ప్రజలను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణించినవారు, ఇక్కడి ప్రాజెక్టులకు నిధులు ఇవ్వకుండా.. అభివృద్ధికి ఆమడదూరం ఉంచిన నేతలంతా.. అధికారం పోవడంతో నల్లగొండ మీడ పడ్డారని ఆయన ఎద్దేవా చేశారు. 70 శాతం పూర్తయిన SLBC టన్నెల్ పనులను పదేండ్లలో ఎందుకు పూర్తి చేయలేదని ఆయన నిలదీశారు.
మాది ప్రజల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వమని.. దశబ్ధ కాలంగా అభివృద్ధికి దూరంగా ఉన్న నల్లగొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజాప్రభుత్వం రావడంలో కీలకపాత్ర పోషించిన నల్లగొండ ప్రజల రుణం తీర్చుకుంటామని ఆయన ప్రకటించారు.