Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth Reddy: తెలంగాణకు స్టాన్‌ఫోర్డ్ వర్సిటీ సహకారం

బయోడిజైన్ రంగంలో నైపుణ్యాల అభివృద్ధి లక్ష్యం

ప్రభుత్వంతో భాగస్వామ్యం.. శాటిలైట్ సెంటర్ పై ఆసక్తి

ముఖ్యమంత్రి లేఖను అందించిన యూనివర్సిటీ బృందం

Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు కాలిఫోర్నియాలోని స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ (Stanford University)ముందుకు వచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (Revanth Reddy), పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించింది. స్టాన్ పోర్డ్ బైర్స్ సెంటర్ ఫర్ బయోడిజైన్ విభాగంలోని సీనియర్ ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా హెల్త్ కేర్లో కొత్త ఆవిష్కరణలు, విద్య, నైపుణ్య అభివృద్ది అంశాలపైనే ప్రధానంగా చర్చలు జరిగాయి. తెలంగాణలో ఏర్పాటు చేసే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, న్యూ లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీలో భాగస్వామ్యం పంచుకోవాలని ప్రభుత్వం వారిని ఆహ్వానించింది. పరస్పరం అధునాతన పరిజ్ఞానాన్ని పంచుకునే కార్యక్రమాలతో పాటు ఉమ్మడిగా పరిశోధనలు నిర్వహించాలనే అభిప్రాయాలు ఈ సమావేశంలో వ్యక్తమయ్యాయి. తెలంగాణలో స్టాన్‌ ఫోర్డ్ బయోడిజైన్ శాటి లైట్ సెంటర్‌ను Stanford Biodesign Sat Light Center) ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలపై చర్చలు జరిగాయి.

స్టాన్‌ఫోర్డ్ అధ్వర్యంలో జరిగే బయోడిజైన్ ఆవిష్కరణలను రాష్ట్రంలో అకడమిక్, హెల్త్ కేర్ విభాగాలకు అనుసంధానం చేయాలని తన ఆలోచనలను ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈ సందర్భంగా వారితో పంచుకున్నారు. ఈ సమావేశం అనంతరం తెలంగాణ ప్రభుత్వానికి తగిన సహకారం అందిస్తామని యూనివర్సిటీలోని బయోడిజైన్ విభాగం అధిపతులు డాక్టర్ అనురాగ్ మైరాల్, డాక్టర్ జోష్ మాకోవర్ ప్రకటించారు. తమ ఆసక్తిని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (Revanth Reddy) లేఖను అందించారు. భారీ వైద్య పరికరాల పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించిందని, దీంతో రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రస్తావించారు. వైద్య పరికరాల విద్య, కొత్త ఆవిష్కరణలకు తమ మద్దతు ఉంటుందని ఆ లేఖలో స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాట్లాడుతూ స్టాన్ ఫోర్డ్ లాంటి ప్రఖ్యాత యూనివర్సిటీతో భాగస్వామ్యం పంచుకోవటం తెలంగాణ యువత భవితకు కొత్త బాటలు వేస్తుందన్నారు. హెల్త్ కేర్ రంగంలో యువతకు నైపుణ్యాల అభివృద్ధిని అందించేందుకు స్టాన్ఫోర్డ్ భాగస్వామ్యం కోరినట్లు తెలిపారు. ఇప్పటికే దేశంలో పరిశ్రమలు, కొత్త ఆవిష్కరణల్లో తెలంగాణ ముందంజలో ఉందని చెప్పారు. స్టాన్‌ఫోర్డ్ బయోడిజైన్ లాంటి ప్రపంచ స్థాయి విభాగాలు కలిసి వస్తే స్కిల్స్ డెవెలప్మెంట్ (Skills Development) లో ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరుతుందని అభిప్రాయపడ్డారు. ఈ భాగస్వామ్యం ఒక్క తెలంగాణ వృద్ధికే కాకుండా.. యావత్ ప్రపంచానికి హెల్త్ కేర్ రంగంలో కీలకంగా నిలుస్తుందని అన్నారు.

స్టాన్ ఫోర్డ్ భాగస్వామ్యంతో రాష్ట్రంలో ఏర్పాటయ్యే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్శిటీ, లైఫ్ సైన్సెస్ యూనివర్శిటీల లక్ష్యం నెరవేరుతుందని మంత్రి శ్రీధర్ బాబు (Shridhar Babu) అన్నారు. తెలంగాణలో లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ పరిశ్రమల వృద్ధికి మరో ముందడుగు పడుతుందన్నారు.