— గవర్నర్ వద్దకు వెళ్లిన పేర్లను క్షుణ్ణంగా పరిశీలించాలి
–ప్రజా సంఘాల ఐక్యవేదిక డిమాండ్
RTI Commissioners :ప్రజాదీవెన నల్గొండ :ఆర్టిఐ కమిషనర్ల నియామకంలో రాజకీయ పార్టీల నాయకుల నియామకం సరైంది కాదని ప్రజా సంఘాల ఐక్యవేదిక అభిప్రాయపడింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సమాచార కమిషనర్ల నియామకం కోసం గవర్నర్ వద్దకు పంపిన పేర్లను క్షుణ్ణంగా పరిశీలించాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో వివిధ సంఘాల ఆధ్వర్యంలో సమాచార కమిషనర్ల నియమాకాల కొరకు పంపిన పేర్ల జాబితాలోని వ్యక్తుల విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుతూ వివిధ సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ కోటగిరి దైవాధీనం మాట్లాడుతూ సమాచార కమిషనర్లుగా రాజకీయాలకు అతీతంగా రాజకీయాలకు సంబంధం లేని వారిని నియమించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లా గ్రంథాలయు సంస్థ మాజీ చైర్మన్ గాదే వినోద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో సామాన్య ప్రజలకు న్యాయం జరగాలంటే సమాచార కమిషనర్లను న్యాయబద్ధంగా వ్యవహరించే వారినే నియమించాలని ప్రస్తుతం నియమించిన వారి విషయంలో మరోసారి పరిశీలన జరపాలని కోరారు.
ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎండి. రజీయుద్దిన్ మాట్లాడుతూ ఆర్టిఐ కమిషనర్ల నియామకంలో పారదర్శకత పాటించాలని అనర్హులను ఎంపిక చేయొద్దని అన్నారు. ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు తలారి రాంబాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేకూరాలంటే చట్టాలపై అవగాహన ఉన్న వారిని నియమించాలని కోరారు. ఎస్సి ఎస్టి విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ పార్టీలకతీతంగా సమాజంలోని అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా కమిషనర్లను నియమించటం ప్రభుత్వ బాధ్యతని అందుకు భిన్నంగా రాజకీయాలకు చెందిన వారిని నియామకానికి పేర్లు గవర్నర్ కు పంపడం తగిన విధానం కాదని అన్నారు. సమాచార హక్కు సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బండమీది అంజయ్య మాట్లాడుతూ సుదీర్ఘ పోరాటాల తర్వాత పార్లమెంట్ ద్వారా చట్టంగా వచ్చిన సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని పేర్కొన్నారు. దీనిని కాపాడేందుకు రాజకీయాలకు సంబంధం లేకుండా సమర్ధులను నియమించాలని ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించాలని కోరారు. గవర్నర్ నియామకం చేయుటకు ముందుగా పూర్తిగా ఆ వ్యక్తుల అర్హతలు, సేవలు, అనుభవం లను చూసి నియమాకాల ఆదేశాలు జారి చేయాలని డిమాండ్ చేశారు. ఆశ్రిత సంస్థకు చెందిన ధనమ్మ మాట్లాడుతూ ప్రజా సంఘాలు తీసుకునే నిర్ణయాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్నాటి యాదగిరి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రతి సామాజిక వర్గం నుంచి ఒకరిని నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు వికాస సమితి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బైరు సైదులు గౌడ్, చిత్రం శ్రీనివాస్, ఆర్ టి ఐ కార్యకర్త కుడుతల రవీందర్, ఎస్సీ ఎస్టి సంఘం చైర్మన్ గాదే యాదగిరి, ఆశ్రిత సంస్థకు చెందిన
ఎం శోభారాణి. మానవ హక్కుల పరిరక్షణ సంస్థ చెందిన అమృత రాజు, బీసీ ఎస్సీ ఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు సీతా వంశీ, కే. వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.