Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Sardar Sarvai Papanna : బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వీరోచిత చరిత్ర

— జిజేఎస్, నల్లగొండ

Sardar Sarvai Papanna : ఔరంగజేబు చక్రవర్తిని ఎదు రించింది ఒక్క మరాఠా వీరులు మాత్రమే అన్నట్టు ఇవాళ సోషల్ మీడియా ఊగిపోతుంది. ఐరనీ ఏంటంటే తెలంగాణ వాళ్లు కూడా దాన్నే నిజం అనుకుం టున్నరు. మహాత్మా పూలే కంటే ముందే గోల్కొండ గడ్డపై సామా జిక న్యాయాన్ని అమలుచేసిన బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ది కూడా వీరోచిత చరిత్ర అన్న సంగతి చాలా మందికి తెలియదు. శివాజీ, సంభాజీ లెక్కనే మొఘల్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన పాపన్న గౌడ్, వరంగల్ జిల్లా ఖిలాష పూర్ లో 1650 అగష్టు 18న పుట్టిండు.
జమీన్ దార్లు,జాగీర్ దార్ల అరాచకాలకు వ్యతిరేకంగా మొదలైన పాపన్న గౌడ్ తిరుగుబాటు గొల్లకొండ కోటను గెలిచేదాకా ఆగలేదు. చాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాండ్లు, దూదేకుల పీర్ మహ్మద్, కొత్వాల్ మీర్ సాహెబ్ వంటి బహుజన వీరులతో గెరిల్లా సైన్యాన్ని తయారుచేసిన పాపన్న, అగ్రకుల భూస్వాములు, వ్యాపారుల గడీలపై, కోటలపై దాడి చేసి సంపదను బహుజన పేదలకు పంచిండు. గడీల్లో బందీలుగా మగ్గుతున్న అణగారిన కులాల ప్రజలను విడిపించిండు. వరంగల్ జిల్లా ఖిలాషాపూర్ లో పటిష్టమైన కోటను కట్టించిండు.

పన్నెండు మందితో ప్రారంభమైన పాపన్న గౌడ్ సైన్యం పన్నెండు వేలు అయింది. చిన్న చిన్న సంస్థాలను గెలిచి రాజ్యాన్ని విస్తరించిండు. మర ఫిరంగుల నుంచి అశ్వబలం వరకు ఒక రాజ్యానికి ఉండవలసిన అన్ని రకాల సైనిక సంపత్తిని సమకూర్చుకున్నడు. మొఘల్ సామ్రాజ్యానికి కీలకమైన దక్కన్ ప్రాంతంలో పాపన్న గౌడ్ చేస్తున్న తిరుగుబాటు నాటి చక్రవర్తి ఔరంగజేబును చికాకు పరిచింది. అందుకే తన సేనాని రుస్తుంఖాన్ ను 1706 లో పాపన్న మీదకు పంపిండు. గెరిల్లా యుద్ధ తంత్రంలో ఆరితేరిన గౌడ్ సాబ్ సైన్యం ముందు మొఘల్ ఆర్మీ నిలవలేకపోయింది.
1707 లో ఔరంగజేబు చనిపోయినంక మొఘల్ సింహాసనాన్ని బహదూర్ షా అధిష్టించిండు.అతని తమ్ముడైన బీజాపూర్ సుల్తాన్ మహ్మద్ కామ్ బక్ష్ కు ఇది నచ్చలేదు. ఇంకేముంది తిరుగుబాటు. మచీపట్నంలో ఉన్న డచ్,ఇంగ్లీష్ వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు కొన్న పాపన్న, కుటుంబ గొడవల్లో మొఘలులు ఉండగానే వేలాది సైన్యంతో వరంగల్ కోటను స్వాధీనం చేసుకున్నడు.తరువాత భువనగిరి ఖిల్లాపై బహుజన జెండాను ఎగురవేసిండు.

పాపన్న పోరాటం గురించి తెలుసుకున్న బహదూర్ షా, అతనికి స్నేహ హస్తం అందించిండు.అధికారిక గుర్తింపు కోసం కప్పం చెల్లించి రాజ్యపాలన చేసుకోవచ్చన్న షా ఆఫర్ ను పాపన్న తెలివిగా ఉపయోగించుకున్నడు. 14 లక్షల రూపాయలతో పాటు మొఘల్ సైనికులకు భారీగా ఆహారధాన్యాలు ఇతర నిత్యావసర వస్తువులు ఇచ్చి ప్రతిఫలంగా గోల్కొండ కోటకు రాజు చేయాలని షరతు విధించిండు. అనుకున్నది సాధించి గోల్కొండ కోటకు రాజైండు పాపన్న గౌడ్.
పరాక్రమంలోనే కాదు రాజనీతిలో కూడా పాపన్న ఏ చక్రవర్తికి తీసిపోడు స్వయం సమృద్ధి కోసం ఎన్నో సంస్కరణలు అమలుచేసిండు. కులవృత్తులను ప్రోత్సహించిండు. వేలాది ఎకరాల్లో తాటి,ఈత,జీలుగు చెట్లను నాటించిండు. అయితే ఒక కల్లుగీసేవాడు గోల్కొండ కు రాజు కావడాన్ని కొన్ని కులాలు జీర్ణించుకోలేకపోయాయి.బహదూర్ షాకు లేనిపోని మాటలు చెప్పి పాపన్నపై యుద్ధానికి రెచ్చగొట్టినయి.1709 లో తాడికొండలో మొఘల్ సైన్యంతో కొన్ని నెలల పాటు జరిగిన యుద్ధంలో పాపన్న ఓడిపోయిండు. హుస్నాబాద్ లో అజ్ఞాతంలో ఉన్న పాపన్న గౌడ్ ఆచూకీని ఒక ద్రోహి ద్వారా తెలుసుకున్న మొఘల్ సైనికులు సర్దార్ తలను నరికి బహదూర్ షాకు బహుమానంగా పంపిన్రు. మొండాన్ని గోల్కొండ కోట గుమ్మానికి వేలాడదీసిన్రు.

స్వయంపాలన కోసం ఉద్యమించిన వీరుడిగా చరిత్రలో నిలిచిన పాపన్నకు రావలసినంత గుర్తింపు రాలేదు. అదే కాలంలో మొఘల్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన శివాజీకి మన పాపన్న ఏ మాత్రం తక్కువ కాదు. కాని ఏం జరిగింది. శివాజీని కులాలకు అతీతంగా ఓన్ చేసుకుంటున్నవాళ్లు, పాపన్న గౌడ్ ను మాత్రం ఒక్క కులానికే పరిమితం చేసిన్రు. దోపిడి దొంగగా చిత్రీకరించిన్రు.
మనం పట్టించుకోకున్నా, గుర్తించి గౌరవించకున్నా ప్రపంచ ప్రసిద్ధి గాంచిన లండన్‌ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పాపన్న గౌడ్ చరిత్రపై అధ్యయనం చేసి, “ది న్యూ కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇండియా”, “ది సోషల్ హిస్టరీ ఆఫ్ ది డెక్కన్” వంటి పుస్తకాలలో ఆయన ఫోటోతో సహా వివరాలను ప్రచురించింది