Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revenue Services : రెవెన్యూ సేవల సరళతరం కోసమే సదస్సులు

–జూన్ 3 నుండి 20 వరకు నిర్వహణ

–ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలి

— సదస్సులకు ఒక రోజు ముందే టాం టాం వేయించాలి

–రోజు ఉదయం 9 నుండి సాయంత్రం 4 వరకు సదస్సులు నిర్వహించాలి

ప్రతిరోజు ఆర్డిఓ కార్యాలయంలో దరఖాస్తులపై చర్చించాలి

— జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Revenue Services : ప్రజా దీవెన,
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 3 నుండి 20 వరకు జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. శనివారం ఆమె ఉదయాదిత్య భవన్లో తహసీల్దార్లు, సర్వేయర్లు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు తో రెవెన్యూ సదస్సుల నిర్వహణ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.
రెవెన్యూ సేవలను సరళతరం చేయడం, ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు గాను ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నదని, అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూ భారతి చట్టం 2025 ను పకడ్బందీగా అమలు చేసేందుకు ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రెవెన్యూ సదస్సులు నిర్వహించే వివరాలను ముందుగానే ప్రజలందరికీ తెలిసే విధంగా విస్తృత ప్రచారం చేయాలని, ఆయా గ్రామాలలో నిర్వహించే సదస్సులకు ఒక రోజు ముందే టాం,టాం ద్వారా ప్రచారం కల్పించాలని, అంతేకాక ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, వాట్సాప్ ల ద్వారా ప్రచారం చేయాలన్నారు.రెవెన్యూ సదస్సులు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించాలని, ప్రతిరోజు సాయంత్రం ఆర్డీవో కార్యాలయంలో ఆ రోజు వచ్చిన దరఖాస్తులపై చర్చించాలని తెలిపారు.

 

దరఖాస్తుల డేటా కోసం ప్రత్యేకంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ ను నియమించాలన్నారు.రెవెన్యూ సదస్సుల నిర్వహణకు గాను ప్రతి మండలంలో రెండు బృందాలుగా ఏర్పడి ఒక బృందానికి తహసిల్దార్, మరో బృందానికి నాయబ్ తహసీల్దార్ నాయకత్వం వహించాలని, బృందంలో ఆర్ఐ, సర్వేయర్, సీనియర్, జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉండేలా చూడాలన్నారు. రెవెన్యూ సదస్సులు నిర్వహించే చోట టెంటు, కుర్చీలు, ఫ్లెక్సీ బ్యానర్ లు, హెల్ప్ డెస్క్ లు, దరఖాస్తులు స్వీకరించేందుకు దరఖాస్తుల స్వీకరణ కేంద్రం, సరిపోయినన్ని ప్రింటు దరఖాస్తులు, భూములకు సంబంధించిన అన్ని రిజిస్టర్ లను వెంట తీసుకు వెళ్లాలని చెప్పారు. దరఖాస్తు స్వీకరించిన తర్వాత దరఖాస్తుదారులకు రశీదు ఇవ్వాలని, దరఖాస్తులను ఆయా కేటగిరీల వారీగా విభజించి ప్రతిరోజు దరఖాస్తులకు సంబంధించిన వివరాలను తెలియజేయాలని ఆదేశించారు. అంతేకాక చిన్న మండలాలలో దరఖాస్తులు తక్కువగా వచ్చిన చోట చదివి సిద్దంగా ఉంచుకోవాలని,దరఖాస్తులు అన్నింటిని జాగ్రత్తగా భద్రపరచాలని అన్ని అంశాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని
అన్ని రిజిస్టర్లు జాగ్రత్తగా నిర్వహించాలని ఆదేశించారు.

— ఇతర రెవెన్యూ అంశాలను సమీక్షిస్తూ…

రాష్ట్ర ప్రభుత్వం జూన్, జూలై, ఆగస్టు మాసాల కు సంబంధించి రేషన్ బియ్యాన్ని ఒకేసారి లబ్ధిదారులకు ఇవ్వాలని ఆదేశించినందున 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిస్తున్నారని, తహసిల్దార్లు ఈ అంశంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని, రేషన్ బియ్యాన్ని చౌక ధరల దుకాణాల లోనే ఉంచేలా చర్యలు తీసుకోవాలని, 3 నెలల బియ్యం పంపిణీ విషయాన్ని అందరికీ తెలియజేసి తీసుకు వెళ్ళాలా చూడాలని కోరారు. బియ్యం అందుబాటులో ఉండేలా చూడాలని, ఈ విషయంపై తక్షణమే డీలర్లతో సమావేశం నిర్వహించాలని, సన్న బియ్యం పంపిణీ పై ఎట్టి పరిస్థితులలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ 2 న గ్రామస్థాయి మొదలుకొని, జిల్లా కేంద్రం వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల నిర్వహణ పై ముందే గ్రామాలలో ప్రచారం చేయాలని చెప్పారు. దరఖాస్తులను ఏవిధంగా పూరించాలో వివరించారు. ప్రతి దరఖాస్తుకు గ్రామాల వారిగా రసీదు ఇవ్వాలని, దరఖాస్తులు కేటగిరీ వారీగా విభజించుకోవాలని చెప్పారు.
ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులు, ప్రజావాణి ఫిర్యాదులు, కోర్టు కేసులు, ప్రజావాణి పిటిషన్లు, ఎలక్షన్ కు సంబంధించిన విషయాలపై సమీక్షించారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, నల్గొండ ఆర్డిఓ అశోక్ రెడ్డి, దేవరకొండ ఆర్డిఓ రమణారెడ్డి లు మాట్లాడారు.
పైలెట్ మండలం నకిరేకల్ తహసిల్దార్ జహీర్ నకిరేకల్ మండలంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల అనుభవాలను సమావేశానికి హాజరైన వారికి తెలియజేశారు.