–నిర్బంధాన్ని ప్రయోగిస్తూ హక్కులు హరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
— అరెస్ట్ చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులను వెంటనే విడుదల చేయాలి
— ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కంభంపాటి శంకర్
SFI District Secretary Kambhampati Shankar : ప్రజాదీవెన నల్గొండ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శీటీకి చెందిన 400 ఏకరాల భూములను వేలం వేయాలని చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటి శంకర్ ఒక ప్రకటన లో హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర శాసనసభలో సిఎం తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు. కార్పోరేట్ శక్తులకు భూములను అమ్మిన రాష్ట్ర ప్రభుత్వం హెచ్సియు భూములను అమ్మేందుకు అక్కడ అడవులను చదును చేయాలనే పేరుతో బుల్డోజర్, జెసిబిలను దింపి చెట్లను తొలగించే కార్యక్రమం చేపట్టిందని తెలిపారు. జెసిబిలను అడ్డుకున్న విద్యార్ధి నాయకులను అక్రమంగా అరెస్టు చేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి లోకానికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పిలుపునివ్వడంతో ఉలికి పడిన కాంగ్రెస్ ప్రభుత్వం నల్గొండ జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఎస్ఎఫ్ఐ నాయకులు ను అక్రమంగా అరెస్టు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ పిరికిపంద చర్య అని పేర్కొన్నారు. ఇంత దుర్మార్గపు చర్యకు కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుందని ప్రతిపక్షంలో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి గొంతు చించుకుపోయేలా మొత్తుకొని అధికారంలోకి రాగానే విశ్వవిద్యాలయాల భూములను వేలం వేయడమేంటిని ప్రశ్నించారు.
కెసిఆర్ లాంటి నియంతనే ఎదుర్కొన్నాం రేవంత్ రెడ్డి సర్కార్ ను ఎదుర్కోవడం ఎస్ఎఫ్ఐ కి కొత్త కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గుర్తు పెట్టుకోండి మీ తాటాకు చప్పుళ్ళకు విద్యార్థి ఉద్యమాల వేగుచుక్క ఎస్ఎఫ్ఐ అందరదు, బెదురదు. గతంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల తో పెట్టుకుని బతికి బట్ట కట్టలేదన్న చరిత్రను కాంగ్రెస్ మర్చిపోవద్దని హెచ్చరించారు. కనీసం నిరసనను కూడా తట్టుకోలేని ప్రభుత్వం అరెస్ట్ చేసి యూనివర్సిటీ విద్యార్థులను రిమాండ్ తరలించడం అత్యంత దుర్మార్గపు చర్య అని విమర్శించారు. తక్షణమే రిమాండ్ చేసిన వారిపై కేసులు ఎత్తివేయాలని, అక్రమంగా పోలీసు బలగాలను దింపి యూనివర్శీటీలలో విద్యార్థుల ను భయభ్రాంతులకు గురిచేస్తోంది. తక్షణమే పోలీసు బలగాలను వెనక్కి పిలవాలని డిమాండ్ చేసారు. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకోండ, నాగార్జునసాగర్, తిరుమలగిరి, వేములపల్లి, పెద్దవూర మండలాల్లో తక్షణమే అరెస్ట్ చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేసారు. లేని పక్షంలో నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలకు పనుకుంటామని హెచ్చరించారు.