–నాటి సీఈవో రామచంద్ర ఆస్తులు కుప్పలుతెప్పలు
–రూ. 80 కోట్లుగా గుర్తించిన అవినీ తి నిరోధక శాఖ అధికారులు
–మొహియుద్దీన్, అతని కుమారు డిపై తదుపరి చర్యలకు రంగం సిద్ధం
Sheep Scheme:ప్రజా దీవెన, హైదరాబాద్: గొర్రెల పంపిణీ పథకం (Sheep distribution scheme) కుంభకోణం కేసులో ఏ–9గా ఉన్న సబావత్ రాంచందర్ ఆస్తులు రూ.80 కోట్లుగా ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) నిగ్గు తేల్చారు. ఈ కేసుకు ముందు వర కు ఆయన తెలంగాణ స్టేట్ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ సీఈవోగా పని చేశారు. ఈ కేసులో ఇప్పటి వర కు 12 మంది నిందితులు అరెస్టవ్వగా వారిలో ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వోద్యోగులు ఉన్నారు. రాంచందర్ గతంలో తెలంగాణ స్టేట్ షీప్ అండ్ గోట్ డెలప్‌మెంట్ కో–ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్‌కు ఎండీగా (md) కూడా పనిచేశారు. ఆ సమయంలో తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని, గొర్రెల కొనుగోలు, నిధుల చెల్లిం పుల్లో నిబంధనలను తుంగలో తొక్కినట్లు ఏసీబీ గుర్తించింది.
రాంచందర్ 2021–23 మధ్య కాలంలో షీప్ అండ్ గోట్ డెవలప్‌మెంట్‌లో (Sheep and Goat Development)ఉండగానే వచ్చిన అవినీతి ఆరోపణలను సైతం ఏసీబీ పరిగణనలోకి తీసుకుంటోంది. దాంతోపాటు.. ఎన్‌సీడీసీ రుణం రాకపోయినా.. 80 వేల మంది లబ్ధిదారుల నుంచి అదనపు డీడీలను వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇష్టానుసారంగా గొర్రెల యూనిట్ ధరలను పెంచారనే అభియోగాలు కూడా ఉన్నాయి. వీటిపై దర్యాప్తు అధికారులు ఆధారాలను సేకరిస్తున్నారు.
రాంచందర్ అక్రమ ఆస్తులు గుర్తించిన నేపథ్యంలో ఆదాయపు పన్ను(ఐటీ) (it) శాఖ నుంచి వివరాలను సేకరించే దిశలో చర్యలు తీసుకుంటున్నారు. ఈ కేసులో ఏ–1గా ఉన్న మొహియుద్దీన్, అతని కుమారుడు ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. వీరిద్దరూ దుబాయ్‌లో తలదాచుకుంటున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. తదుపరి చర్యల్లో వీరిద్దరి పాస్‌పోర్టులను రద్దు చేయించేదిశలో ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారులకు లేఖ రాసేందుకు సిద్ధమయ్యారు. కాగా.. ఇదివరకే వీరిద్దరూ ఈ కేసుతో తమకు సంబంధం లేదని, కేవలం ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టు వ్యవహారాలను చూసుకున్నట్లు కోర్టుకు వివరించారు. ఏ–10గా ఉన్న కల్యాణ్ ఆదాయం, ఆస్తులపైనా అధికారులు దృష్టి సారించారు. ఏసీబీ అధికారులు ఈ కేసులో ఆంధ్రప్రదేశ్‌కు (ap) చెందిన రైతులను మరోమారు విచారించారు. వారి స్టేట్‌మెంట్‌లను రికార్డు చేశారు. ఏపీ రైతులు ఇచ్చిన ఫిర్యాదుతోనే ఈ కేసు నమోదైంది. తమ ఖాతాకు రావాల్సిన రూ.2.10 కోట్లను ఇతరులకు మళ్లించారంటూ వారు అప్పట్లో గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అలా రూ.2.10 కోట్లతో మొదలైన దర్యాప్తు.. ఇప్పటి వరకు ఈ కుంభకోణం విలువను రూ.700 కోట్లుగా తేల్చింది.