–కాంట్రాక్టర్ ని బ్లాక్ లిస్టులో పెట్టాలి
–మరణించిన కార్మికులకు ఒక్కొక్కరికి కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి
–బీసీ డబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ
SLBC Tunnel : ప్రజాదీవెన , నల్గొండ : ఎస్ ఎల్ బి సి టెన్నె ల్ ప్రమాదంపై నిపుణులతో సమగ్ర విచారణ జరిపి అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, మరణించిన కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర కార్యదర్శి సిహెచ్. లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బుధవారం ఎస్ ఎల్ బి సి ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నల్గొండ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 22న ఉదయం ప్రమాదం జరిగితే 11 రోజులు గడిచిన గల్లంతైన కార్మికుల ఆచూకీ తెలవకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస భద్రత ప్రమాణాలు పాటించకపోవడం ముందుచూపు లేకపోవడం జియాలజికల్ అధికారుల వైఫల్యం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఇద్దరు ఇంజనీర్లు 6 మంది కార్మికులు గల్లంతయ్యారని అన్నారు.
మరణించిన కార్మికుల కుటుంబాల అక్రందన హృదయ విదారకంగా ఉందని ఆ కార్మికుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు కోటి రూపాయల నష్టపరిహారం కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, ప్రమాదానికి కారణమైన కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. 1979 వలస కార్మిక చట్టాన్ని అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఈ చట్టాలను పకడిబందీగా అమలు చేయకపోవడం కనీస భద్రత ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరిగి కార్మికుల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు పునరావడం కాకుండా ఉండాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సమస్యల పట్ల శ్రద్ధ వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కంచి కేశవులు, జిల్లా ఉపాధ్యక్షులు అద్దంకి నరసింహా, పోలే సత్యనారాయణ, జిల్లా సహాయ కార్యదర్శి ఎస్. సైదాచారి, నాయకులు అవుట రవీందర్, కత్తుల శంకర్, బి. వెంకన్న, వెంకట్రావు కాశమ్మ, ఎస్. వెంకటయ్య, లింగస్వామి, ఏ. నరసింహ చారి, గిరి, తదితరులు పాల్గొన్నారు.