–పారిశుధ్యం పై శ్రద్ధ అవసరం
–నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు
— జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరిక
District Collector Tripathi :ప్రజాదీవెన నల్గొండ : జిల్లాలోని అన్ని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న భోజనం విషయంలో సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఈ విషయంలో ఎవరు నిర్లక్ష్యం వహించిన కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. మంగళవారం ఆమె నల్గొండ జిల్లా, గుర్రంపోడు కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి వంటగదిని, డైనింగ్, పాఠశాల ఆవరణలో పరిశుభ్రతను పరిశీలించారు. పదవ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో గణితం పై ప్రశ్నలను అడిగి విద్యార్థులకు మ్యాథమెటిక్స్ పై అవగాహన కల్పించారు. విద్యార్థులకు అందించే భోజనం పట్ల ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కేజీబీవీ ప్రత్యేక అధికారిని ఆదేశించారు. భోజనం, పారిశుధ్య లోపం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు కలిగినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. భోజనం,పారిశుధ్యం ఈ రెండు అంశాలపై పూర్తి శ్రద్ధ నిబద్ధతతో పనిచేయాలని, వంట గదులు, డైనింగ్ తో పాటు, పాఠశాల ఆవరణ మొత్తం శుభ్రంగా ఉండేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు.
అంతకు ముందు జిల్లా కలెక్టర్ భవిత కేంద్రాన్ని సందర్శించి ఇటీవల ప్రభుత్వం భవిత కేంద్రాలకు సరఫరా చేసిన ఆట వస్తువులు, ఇతర సామాగ్రిని పరిశీలించి సంబంధిత స్టాక్ రిజిస్టర్ లో కేంద్రం ఇన్చార్జిగా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం జిల్లా కలెక్టర్ గుర్రంపోడు తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి భూ భారతి పై వచ్చిన దరఖాస్తుల వివరాలను పరిశీలించారు.భూ భారతి దరఖాస్తులు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని చెప్పారు. దేవరకొండ ఆర్ డి ఓ రమణారెడ్డి, గుర్రంపోడు మండల ప్రత్యేక అధికారి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి అనంతరెడ్డి, డీఈఓ బిక్షపతి, గుర్రంపోడు తహసిల్దార్ శ్రీనివాస్, ఎంఈఓ యాదగిరి, డిఈ పరమేష్, కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ ప్రత్యేక అధికారి విజయశ్రీ, ఇతర అధికారులు ఉన్నారు.