–హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్టులను వినియోగంలోకి తీసుకురావాలని
–నిర్దేశించిన సమయం ప్రకారం పూర్తి చేయాలి
— పనుల పురోగతిని క్యాలెండర్ ను రూపొందించాలి
–రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
Deputy Chief Minister Mallu Bhatti Vikramarka : ప్రజాదీవెన నల్గొండ : రాష్ట్రంలోని అన్ని హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ ప్రాజెక్టులలోని అన్ని యూనిట్లు వినియోగంలోకి తీసుకురావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శుక్రవారం అయన నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ జెన్కో పవర్ హౌస్ లో రాష్ట్రంలోని హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టులపై పై సమీక్ష నిర్వహించారు.ముందుగా అధికారులు అన్ని హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఆయా పవర్ ప్రాజెక్టుల వారిగా ప్రస్తుత పరిస్థితిని వివరించారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి అధికారులకు వివిధ అంశాలపై దిశ నిర్దేశం చేస్తూ.. అన్ని హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ లలోని అన్ని యూనిట్లు వినియోగంలో తీసుకురావాలన్నారు. నిర్దేశించిన సమయం ప్రకారం వాటిని పూర్తి చేయాలన్నారు. పవర్ ప్రాజెక్టు యూనిట్లు ఆలస్యం కాకుండా చూసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం ఉండవద్దని , అన్ని ప్రాజెక్టుల పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని, ఇందుకొక క్యాలెండర్ ను రూపొందించాలని, ఏ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో దాని ప్రకారం ప్రతి వారం సమీక్షించాలని, ముందు నుండే సమీక్షలు నిర్వహించాలని చెప్పారు.
ప్రతి సంవత్సరం పవర్ కు డిమాండ్ పెరుగుతున్నదని, సంవత్సర కాలంలోనే 2000 మెగావాట్ల పవర్ డిమాండ్ పెరిగిందని, పెరుగుతున్న పవర్ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని పవర్ ను ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రపంచంలో వస్తున్న నూతన సాంకేతికతపై సిబ్బందికి అప్డేట్ అయ్యే విధంగా శిక్షణ ఇవ్వాలని, దీనిపై అధ్యయనం చేసి పెరుగుతున్న పవర్ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని అప్డేట్ అయ్యేలా చూడాలన్నారు. ఇందుకు పీరియాడికల్ సమీక్షలు నిర్వహించాలని, రాష్ట్రంలో ఉన్న జెన్కో సిబ్బంది సీఎండి మొదలుకొని కిందిస్థాయి వరకు కొత్త టెక్నాలజీ పై మూడు రోజులపాటు రెసిడెన్షియల్ శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో రెన్యూవబుల్ ఎనర్జీ పై దృష్టి సారించాలని, ప్రపంచవ్యాప్తంగా రెన్యువబుల్ ఎనర్జీకి వెళ్తున్న దృష్ట్యా దీనిపై దృష్టి సారించాలన్నారు. గడచిన సంవత్సరం కాలంలో జెన్కో సిబ్బంది ఒక పద్ధతి ప్రకారం పనిచేయడం వల్ల ఎలాంటి బ్రేక్ డౌన్లు, విద్యుత్ కోతలు లేకుండా విద్యుత్ ను అందించగలిగామని, ఇందుకుగాను ఆయన శాఖలోని అధికారులు, సిబ్బందిని అభినందించారు. విద్యుత్ ఉత్పత్తి సరఫరాలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతిదీ విద్యుత్ పైన ఆధారపడి ఉన్నదని, రాష్ట్ర స్థూల ఉత్పత్తి విద్యుత్ పైన ఆధారపడిందని తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర జెన్కో సిఎండి డాక్టర్ హరీష్ ఆయా ప్రాజెక్టులపై వివరాలను తెలియజేశారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, దేవరకొండ శాసనసభ్యులు జైవీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, బాలు నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అదనపు కలెక్టర్లు జే. శ్రీనివాస్, నారాయణ అమిత్, హైడల్ డైరెక్టర్ పి. బాలరాజు, సిఇ నారాయణ, ఎస్ఈ లు వెంకటరమణ , ఓ అండ్ ఎం డి ఎస్ ఈ రఘురాం, సివిల్ ఎస్ ఈ డి. రామకృష్ణారెడ్డి, సిఈ మంగేష్ కుమార్, ఉపేందర్ తదితరులు ఈ సమీక్షకు హాజరయ్యారు.