–స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసే వరకు పోరాటం
–ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యులు ఖమ్మంపాటి శంకర్
Khammampati Shankar : ప్రజాదీవెన నల్గొండ : గత ఆరు సంవత్సరాలుగా బకాయిలో వున్నా స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ మెంట్ తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ కేంద్ర కమిటీ సభ్యులు ఖమ్మంపాటి శంకర్ డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్షిప్ లు అనేవి ఆర్థికంగా వెనుకబడిన పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యా అవకాశాలను అందించడానికి భారత రాజ్యాంగం కల్పించిన హక్కు అని అది ఏ ప్రభుత్వాల బిక్షా కాదని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఉన్నత విద్య అందుకుని ఈ సమాజంలో ఉన్నతమైన స్థాయిలో ఉండటం ద్వారానే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందిన్నారు. బకాయిలో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్లగొండ ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ ఏవో కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
గత ఆరు సంవత్సరాల నుండి 8158 కోట్ల ఫీజు రియంబర్స్ మెంట్, స్కాలర్షిప్స్ రాకపోవడంతో విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచినా విద్యార్థులకు స్కాలర్షిప్స్ విడుదల చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అంతేకాకుండా భారత దేశంలోనే విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం కేవలం తెలంగాణ రాష్ట్రమేనని ఎద్దేవా చేశారు.
ప్రజా పాలన పేరు తో మాయమాటలు చెప్పుతూ కాలం గడుపుతుందన్నారని విమర్శించారు. ఈ సమస్యపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సకాలంలో స్కాలర్షిప్స్ రాక విద్యార్థుల జీవితాలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ సకాలంలో చెల్లించకపోతే, విద్యార్థులు తమ కళాశాల ఫీజులను స్వంతంగా చెల్లించలేక, విద్యను మధ్యలోనే ఆపివేయాల్సి వస్తుందని ఆవేదన చెందారు. సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ నిధులు ఆలస్యం కావడంతో లక్షలాది విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ అప్పులు తీర్చడం కోసం పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇది వారి విద్యా నాణ్యతను దెబ్బతీసింది. ఈ విషయంలోనే ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల బకాయిలను విడుదల చేయాలని లేనిపక్షంలో రాష్ట్రంలో వేలాదిమంది విద్యార్థులను అధిక సంఖ్యలో కూడగట్టి స్కాలర్ షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయడమో రాష్ట్రంలో కాంగ్రెస్ ను పారదోలడమో చేస్తామని ఎస్ఎఫ్ఐ కంకణం కట్టుకుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. విద్యార్థులతో
పెట్టుకున్న ప్రభుత్వాలు బతికి బట్ట కట్టలేదన్న చరిత్ర ను కాంగ్రెస్ ప్రభుత్వం మరచిపోవద్దని గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ నల్లగొండ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు ఎం.ఏ.సైఫ్, మారుపాక కిరణ్, సాయి, కావ్య, మాధవి, దేవి మంజుల, కల్పన, శృతి, సంధ్య, తదితరులు పాల్గొన్నారు.