–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Tripathi : ప్రజాదీవెన నల్గొండ : ప్రభుత్వం నిర్దేశించిన ఎంఆర్పి ధరలకు మించి ఎరువులను అమ్మినా లేదా ఇతర ఎరువులతో లింకు పెట్టినా అలాంటి వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. జిల్లాలో యూరియాతో సహా అన్ని ఎరువులు సరిపోయినంతగా నిల్వలు ఉన్నాయని, అందువల్ల రైతులెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ జిల్లాలోని అన్ని మండలాలలో తగినంతగా ఎరువుల నిలువలు ఉన్నాయని, ఈ నెలాఖరు వరకు ఎలాంటి ఎరువుల కొరతలేదని, జిల్లాలోని అన్ని మండలాలలో ప్రతిరోజు 9000 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉండేలా చూస్తున్నామని, ఈ నెలాఖరు వరకు ఎలాంటి కొరతలేదని స్పష్టం చేశారు.
అంతేకాక జూలై 15 నుండే ఆగస్టు నెలకు అవసరమైన బఫర్ ఎరువులను సిద్ధంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రైవేటు ఎరువుల డీలర్లు లేదా ఇతరులు ఎవరైనా ప్రభుత్వం నిర్దేశించిన ఎమ్మార్పీ ధరలకే ఎరువులను విక్రయించాలని, యూరియా ఇతర ఎరువులు అమ్మేందుకు ఇతర ఎరువులతో ఎట్టి పరిస్థితులలో లింకు పెట్టవద్దని, ఎవరైనా అలా చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆయా మండలాలలో అందుబాటులో ఉన్న ఎరువుల వివరాలను విడుదల చేశారు.