District Collector Tejas Nandalal : ప్రజా దీవెన, కోదాడ: ఆగస్టు 15 నాటికి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు కనీస సామర్థ్యాలు సాధించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ ఆదేశించారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వం బాలుర ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థుల పఠన నైపుణ్యాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల హాజరు, గత సంవత్సరం నిర్వహించిన కార్యక్రమాలను ఈ విద్యా సంవత్సరం నిర్వహించే యాక్షన్ ప్లాన్ ను పరిశీలించారు. బేస్ లైన్ టెస్ట్ ఫలితాలను సమీక్షించి విద్యార్థుల్లో ఇంకా సామర్థ్యాల పెంపుదలకు కృషి చేయాలని సూచించారు. గత సంవత్సరం పదవ తరగతిలో సాధించిన ఫలితాలపై, బడిబాట ద్వారా అత్యధిక విద్యార్థుల నమోదుపై కలెక్టర్ ఉపాధ్యాయులందరినీ ప్రశంసించారు.
పాఠశాలలో 20 లక్షలతో నిర్మించబడుతున్న ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్ పనుల పురోగతిని, నూతనంగా నిర్మిస్తున్న గదుల నిర్మాణాన్ని పరిశీలించారు. బాలికలకు ప్రత్యేకంగా టాయిలెట్ల నిర్మాణానికి 7 లక్షల రూపాయలు మంజూరు చేస్తూ వాటి నిర్మాణానికి ఆదేశించారు. అలాగే బాలుర టాయిలెట్స్ నిర్మాణానికి, పాఠశాలలో అసంపూర్తిగా నిర్మించబడి ఉన్న తరగతి గదులను పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకోవడానికి ఇంజనీరింగ్ శాఖ వారికి పలు సూచనలు చేశారు. ప్రత్యేకంగా బడి తోటను పరిశీలించి దాని అభివృద్ధి గురించి పలు సూచనలు చేస్తూ పాఠశాలలో పెద్ద ఎత్తున మొక్కలను నాటి సంరక్షించాలని మున్సిపల్ కమిషనర్ సహకారాన్ని తీసుకోవాలని సూచించారు . ఈ కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, తాసిల్దార్ వాజిద్ అలీ, మండల విద్యాధికారి సలీం షరీఫ్, ఇంచార్జి ప్రధాన ఉపాధ్యాయులు మార్కండేయ, తదితరులు పాల్గొన్నారు.